చిన్నప్పమ్మ మృతదేహం
లావేరు : సైన్సుతో పోటీపడుతున్న నేటి రోజుల్లో ఇంకా గ్రామాల్లో మూఢనమ్మకాలు పోవడం లేదు. మూఢనమ్మకాలుకు లావేరు మండలంలోని పెద్దలింగాలవలస గ్రామంలో ఒక మహిళ ప్రాణం బలైంది. బుధవారం అర్ధరాత్రి జరిగిన పాము కాటు సంఘటనే దీనికి నిదర్శనం.
మృతురాలు భర్త పారంనాయుడు స్థానిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పెద్దలింగాలవలస గ్రామానికి చెందిన పట్నాన చిన్నప్పమ్మ(48) అనే మహిళ బుధవారం రాత్రి భోజనం చేసిన అనంతరం వారి ఇంటి ఎదుట ఉన్న ఇసుక పోగులు వద్దకు వెళ్లింది.
చల్లగాలి వేయడంతో ఇసుక పోగులుపైన పడుకుండిపోయింది. అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో ఇసుక పోగులపై పాము వెళుతుండగా అక్కడ నిద్రిస్తున్న చిన్నప్పమ్మ దండపై కాటు వేసింది. వెంటనే నిద్రలో నుంచి మేల్కొన్న చిన్నప్పమ్మ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసింది.
అయితే వారు చిన్నప్పమ్మను ఆస్పత్రికి తీసుకువెళ్లకుండా గ్రామంలో ఉన్న పాము కాటుకు మంత్రాలు వేసే మంత్రగాడి వద్దకు తీసుకువెళ్లారు. మంత్రగాడు మంత్రాలు వేసి ఇంటికి పంపించాడు.
ఇంటికి వెళ్లిన తర్వాత ఎప్పటికి చిన్నప్పమ్మకు నొప్పి తగ్గకపోవడం, శ్వాస పీల్చడం కష్టం కావడంతో గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కుటుంబ సభ్యులు ఆమెను లావేరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు.
ఆస్పత్రి వైద్యుడు పరీక్షించగా అప్పటికే ఆమె మృతి చెందినట్టు నిర్ధారించాడు. కుటుంబానికి పెద్ద దిక్కు అయిన చిన్నప్పమ్మ పాము కాటుతో మృతి చెందడంతో ఆమె భర్త, కుమారుడు, కుమార్తెలు కన్నీరుమున్నీరుగా విలపించారు.
విషయాన్ని మృతురాలు భర్త లావేరు పోలీసులుకు తెలియజేయడంతో వారు వచ్చి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. లావేరు పోలీసులు కేసు నమోదు చేశారు.
వెంటనే వైద్యం అంది ఉంటే ప్రాణాలు దక్కేవి
పాము కరిచిన వెంటనే మహిళను ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యసేవలు అందిస్తే ప్రాణాలు దక్కేవని పలువురు గ్రామస్తులు అంటున్నారు. మూఢనమ్మకాలతో పాము కాటుకు మంత్రాలు వేయించి వైద్యసేవలు అందకుండా నిర్లక్ష్యం చేయడం వల్లనే మహిళ నిండు ప్రాణాలు పోయాయని ఆవేదన చెందుతున్నారు. ఇక నుంచి అయినా ప్రజలు మూఢనమ్మకాలు విడనాడాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment