శ్రీకాకుళం: రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వారిది. తల్లి తీవ్ర అనారోగ్యంతో శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తండ్రి తాపీ పనిచేసేందుకు కొద్ది రోజుల క్రితం రాజమండ్రి వెళ్లాడు. అక్క, తమ్ముడు కలిసి ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో కట్లపాము కాటు వేయడంతో తమ్ముడు మృత్యువాతపడ్డాడు. ఈ విషాద ఘటన పొందూరు మండలం తోలాపిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
తోలాపి ఎస్సీ కాలనీలో నివాసముంటున్న రావాడ చిన్నయ్య, నీలవేణికి కుమార్తె రమ్య, కుమారుడు లవకుమార్(14) ఉన్నారు. లవకుమార్ తోలాపి జెడ్పీ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. చిన్నయ్య, నీలవేణి రోజువారీ కూలీలు. నీలవేణికి అనారోగ్యం కారణంగా శ్రీకాకుళంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కుటుంబ పోషణ కోసం చిన్నయ్య రెండు రోజుల క్రితం రాజమండ్రి వెళ్లాడు. దీంతో అక్క రమ్యతో కలిసి లవకుమార్ ఇంటిలో ఉంటున్నారు.
సోమవారం రాత్రి 11 గంటల సమయంలో గాలి తగలడం లేదని తలుపుతీసి పడుకున్నారు. ఆ సమయంలో కట్లపాము లవకుమార్‌ను కాటువేసింది. మెలకువ రావడంతో ఏదో పురుగు కుట్టిందనుకుని నిద్రలోకి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత పాము మెడకు చుట్టినట్లు అనిపించడంతో ఒక్కసారిగా నిద్రలేచి పామును గుర్తించాడు. పామును విసిరేస్తే అక్కకు ప్రమాదం జరుగుతుందని గ్రహించి భయపడకుండా చేతితో తీసి నేలకు గట్టిగా కొట్టాడు. తర్వాత పామును కొట్టి చంపాడు.
అలికిడి కావడంతో అక్క నిద్రలోనుంచి లేచింది. అప్పటికే పాము కరిచి చాలాసేపు కావడం, తమ్ముడి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండటంతో బయటకు వెళ్లి చుట్టుపక్కల వారిని పిలిచింది. వారు లవకుమార్‌ను శ్రీకాకుళం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు.
అప్పటి వరకు తనతో ఉన్న తమ్ముడు పాముకాటుకు బలికావడంతో అక్క కన్నీటిపర్యంతమైంది. తల్లిదండ్రులకు విషయాన్ని చేరవేసింది. వారు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ముందు రోజు వరకు రోజూ పాఠశాలకు వస్తున్న విద్యార్థి ఇక లేడని తెలిసి ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి మృదేహానికి పోస్టుమార్టం చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment