మృతదేహంతో ఆస్పత్రి వద్ద ఆందోళన చేస్తున్న తిడ్డిమి గ్రామస్తులు
శ్రీకాకుళం, పాతపట్నం: జిల్లాలో పాముకాటుకుగురై ఇద్దరు మహిళలు మృతి చెందారు. పాతపట్నం మండలంలో ఒకరు, పలాస మండలంలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల బంధువులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. పాతపట్నం మండలంలోని తిడ్డిమి గ్రామానికి చెందిన బేరి ఆదిలక్ష్మి(48) సోమవారం పాము కాటుతో మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వళ్లే మృతి చెందిందని మృతురాలి కుటుంబ సభ్యులు పాతపట్నం ప్రభుత్వ సామాజిక ఆస్పత్రి వద్ద మృతదేహంతో ధర్నా చేశారు. ఉదయం ఇంటిలో స్లేడ్‌పై ఉన్న కొడవలిని బేరి ఆదిలక్ష్మి తీస్తుండగా పాము కాటు వేసింది. వెంటనే కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాతపట్నం ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యులు హెచ్.అరుణకుమారి, కె.మోహన్‌బాబు ప్రథమ చికిత్స అందించి, పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. అంబులెన్స్‌లో శ్రీకాకుళం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాతపట్నం ఆస్పత్రికి తీసుకువచ్చి ఆస్పత్రి వద్ద వైద్యుల నిర్లక్ష్యం వళ్లే మృతి చెందిందని ధర్నా చేశారు. సంఘటన విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ ఎం.హరికృష్ణ, పోలీసులు ఆస్పత్రికి చెరుకున్నారు. మృతురాలు భర్త కృష్ణారావు, కుమారుడు వేణుగోపాలరావు, గ్రామస్తులను కలిసి జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇదే విషయం ఆస్పత్రి సూపరింటెండెంట్ రామ్మోహనరావు మాట్లాడుతూ ఆదిలక్ష్మిని ఆస్పత్రికి తీసుకువచ్చిన వెంటనే ఎ.ఎస్.వి. ఇంజక్షన్ అందించామని, పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిఫర్ చేశామని, వెంటనే అంబులెన్స్ పంపించామని తెలిపారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహానికి శవపంచనామా, పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అందజేశామని ఎస్‌ఐ తెలిపారు.
చినపలియాలో విషాదం
కాశీబుగ్గ: ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లో మహేంద్రగిరుల పాదాల చెంతన ఉన్న పలాస మండలం లొత్తూరు పంచాయతీ చినపలియా గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఈ గ్రామానికి చెందిన సవర సుక్కి(45) ఆదివారం అర్ధరాత్రి పాముకాటుకు గురై మృతి చెందింది. ఈమె రాత్రి భోజనం చేసిన తర్వాత ఆరుబయట పడుకుంది. నిద్రమత్తులో ఉన్న ఆమె వైపునకు ఎలుక రావడంతో దానిని వెంబడిస్తూ వచ్చిన పాము సుక్కిని కాటువేసింది. మెలకువలోకి వచ్చిన ఆమె వెంటనే ఏదో కరిసిందని కుటుంబ సభ్యులకు చెప్పి స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపీ వద్ద ఇంజక్షన్ వేసుకుంది. అనంతరం నాటువైద్యం మందు కూడా తీసుకుంది కాని, తినలేదు. ఏది కరిచిందో తెలియక ఆమె ఇంటికి చేరుకుని పడుకుంది. వేకువజామున కుటుంబీకులు చూడటంతో అప్పటికే అపస్మారకస్థితిలో ఉన్న ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది వచ్చి పరిశీలించగా అప్పటికే మృతి చెందిందని చెప్పారు. కుటుంబ సభ్యులు సుక్కిని ఆటోలో పలాస సామాజిక ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం తర్వాత స్వగ్రామం చినపలియాకు తరలించారు. ఆమె భర్త పిల్లలు చిన్నప్పుడే అనారోగ్యంలో మృతి చెందాడు. కుమార్తె కృపావతి పదవ తరగతి, కుమారుడు భరణబాసు 9వ తరగతి కిల్లోయి కాలనీలో గిరిజన వసతి గృహంలో చదువుతున్నారు. పిల్లలు ప్రస్తుతం ఎవరూ లేక అనాథగా మిగిలారు. సవర సుక్కి మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment