
ఆసుపత్రి ముందు ధర్నా చేస్తున్న బాధిత కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు
గజ్వేల్‌రూరల్ : ఓ యువతి అబార్షాన్ కోసం గజ్వేల్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి రాగా అధిక రక్తస్రావంతో మృతి చెందిన సంఘటన మంగళవారం అర్ధరాత్రి జరగ్గా... బుధవారం ఉదయం బాధిత కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు ఆసుపత్రి ముందు ధర్నా చేపట్టారు.
వైద్యాధికారులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... గజ్వేల్ పట్టణంలోని పద్మసాయి ఆసుపత్రిలో మంగళవారం రాత్రి సమయంలో రాయపోల్ మండలం లింగారెడ్డిపల్లికి చెందిన ఓ యువతి(22) అబార్షన్‌కోసం మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి వచ్చింది.
చికిత్స అందిస్తున్న క్రమంలో యువతికి అధిక రక్తస్రావం కావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించగా... మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు.
తమకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న గజ్వేల్ సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళన చేస్తున్న వారిని సముదాయించారు. యువతి మృతి చెందిన విషయం తెలుసుకున్న డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో బలరాం ఆధ్వర్యంలోని వైద్యబృందం గజ్వేల్‌కు చేరుకొని ఆసుపత్రిని సీజ్ చేశారు.
ఈ సందర్భంగా గజ్వేల్ పోలీస్‌స్టేషన్‌లో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న కరుణసాయి ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలంటూ డిప్యూటీ డీఎఅండ్‌హెచ్‌వో బలరాం ఫిర్యాదు చేశారు. సమాచారం తెలుసుకున్న గజ్వేల్ ఐఎంఏ శాఖ సభ్యులు పద్మసాయి ఆసుపత్రికి చేరుకొని వైద్యాధికారులను నిలదీశారు.
ఎలాంటి అనుమతులు లేకున్నా ఆసుపత్రులు కొనసాగుతున్న విషయం తెలిసినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. అనుమతులు లేకుండా ఆసుపత్రులు నిర్వహిస్తున్నట్లుగా గతంలోనే వైద్యాధికారులకు తెలియజేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment