
యాసిడ్ దాడిలో గాయపడ్డ మహిళ మృతి
కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలో శుక్రవారం ఓ జంటపై జరిగిన యాసిడ్‌దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న రాణి శనివారం ఉదయం మృతిచెందింది.
కేసరపల్లి సమీపంలోని బుడమేరు వంతెన వద్ద గుర్తుతెలియని వ్యక్తుల యాసిడ్ దాడిలో గాయపడిన రాణి శనివారం మృతిచెందారు. తలకు బలమైన గాయాలతో ప్రయివేటు ఆస్పత్రిలో చేరిన ఆమె తుదిశ్వాస విడిచారు.
- వివాహేతర సంబంధాల నేపథ్యంలోనే దాడి ఘటన
- పోలీసుల అదుపులో ఐదుగురు
గన్నవరం : యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాణి శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. శుక్రవారం రాత్రి బైక్‌పై విజయవాడ నుంచి గన్నవరం వైపు వస్తున్న రాణితో పాటు ఆమె ప్రియుడు కఠారి రాజేష్‌పై మండలంలోని కేసరపల్లి సమీపంలోని బుడమేరు వంతెన వద్ద గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్‌తో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రాణి, రాజేష్‌లను 108 విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. యాసిడ్ గాయాలతో పాటు సంఘటన జరిగినపుడు రాణి బైక్‌పై నుంచి కిందపడి పోవడంతో తలకు బలమైన గాయాలై అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో చికిత్స పొందుతూ అర్ధరాత్రి దాటాక రెండు గంటల సమయంలో రాణి మృతిచెందింది. రాజేష్ మాత్రం కొలుకున్నట్లు పోలీసులు తెలిపారు.
వివాహేతర సంబంధాలే కారణం
వివాహేతర సంబంధాలే ఈ యాసిడ్ దాడికి కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఉంగుటూరు మండలం తేలప్రోలుకు చెందిన రాణి(31)కి భర్తతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా 2008లో విడాకులు తీసుకుంది. కుమారైతో కలిసి రాణి గన్నవరంలో ఉంటూ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ పిల్లల ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. సమీప బంధువైన ఫొటోగ్రాఫర్ కిరణ్‌కు దగ్గరై.. ఆతడితో సహజీవనం సాగిస్తోంది. ఏడాదిన్నర క్రితం పరిచయమైన బుద్దవరం శివారు రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన కఠారి రాజేష్(28)తో కూడా సన్నిహితంగా మెలుగుతోంది. ఈ విషయమై కిరణ్‌కు ఆమెకు గొడవలు కూడా జరిగాయి.
గతంలో రాజేష్‌పై ఫిర్యాదు
రాజేష్ తనను వేధిస్తున్నాడని రాణి గత ఏడాది డిసెంబర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తరువాత దానిని ఉపసంహరించుకుంది. అనంతరం రాజేష్‌కు మరింత దగ్గరకావడంతో పాటు వివాహం చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. అనారోగ్యం కారణంగా ఉద్యోగం మానేసిన ఆమె.. నెల రోజుల క్రితం తేలప్రోలులోని పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని రాజేష్‌తో తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.
పోలీసుల అదుపులో అనుమానితులు
సంఘటన జరిగిన రెండు గంటల వ్యవధిలోనే పోలీసులు అనుమానితులను అదుపులో తీసుకున్నారు. ఆమె సమీప బంధువైన కిరణ్‌తో పాటు ఆతనికి సహకరించారనే అనుమానంతో ఆతని సోదరుడు ప్రసన్న, గోపి, పవన్‌కుమార్, మరో వ్యక్తిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. తనను కాదని మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందనే అక్కసుతోనే కిరణ్ ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. రాణి విషయమై గతంలో రాజేష్‌ను కొంతమంది యువకులతో కిరణ్ కొట్టించాడు. ఈ సంఘటనల నేపథ్యంలో పోలీసులు అనుమానితుల నుంచి వాస్తవాలను రాబట్టే ప్రయత్నంలో ఉన్నారు.