
మహుబూబి (ఫైల్), నుజ్జు నుజ్జయిన ఆటో, గాయపడ్డ ఆటో డ్రైవర్
ఆదిలాబాద్ : రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు రంజాన్ పండగ పూట ఆ ఇంట్లో విషాదం మిలిచ్చింది. ఇద్దరి చిన్నారులను ఆలనాపాలనకు దూరం చేసింది. మావల గ్రామపంచాయతీ పరిధిలోని సుభాష్‌నగర్‌కాలనీకి చెందిన మహుబూబి(50) శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని బస్టాండ్ ఎదుట జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు..సుభాష్‌నగర్ నుంచి ఆటోలో తన మనవరాలు సానియమెహరి(9)తో కలిసి కిన్వాట్ వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌కు వస్తుండగా, పంజాబ్‌చౌక్ ప్రాంతంలో ఈ ఆటో మరో ఆటోకు తగలించడంతో ఆటోలో ఉన్న చిన్నారి చేతికి గాయమైంది. దీంతో అక్కడి నుంచి రిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా వేగంగా వస్తున్న ఆటో బస్టాండ్ దగ్గర రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని తప్పించబోయి బోల్తా పడింది.
దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న మహుబూబి అక్కడిక్కడే మృతి చెందగా చిన్నారి సానియా, సుభాష్‌నగర్ కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ రాహుల్, రోడ్డుపై వెళ్తున్న గాంధీనగర్‌కు చెందిన సంతోష్‌లకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ స్వామి తెలిపారు.
ఆలనాపాలనకు దూరమైన చిన్నారులు
ఓ పక్క సంతోషంగా పండుగా చేసుకునే సమయంలో..రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. మహూబూబిపైనే ఆధారపడి ఉన్న ఇద్దరు చిన్నారులు ఆలనాపాలనకు దూరమయ్యారు. మహూబూబి కూతురు సిరాజ్ 2011లో మృతి చెందింది. ఆమె భర్త వేరే కాపురం పెట్టడంతో కూతురు పిల్లలు సానియా, కుమారుడు ఆర్మాన్‌ను తనే పెంచుతోంది.
భర్త ఎస్‌కే సలీంతో కలిసి పిల్లల ఆలనాపాలన చూస్తోంది. చిన్ననాడే తల్లిని కోల్పోయి..తండ్రికి దూరమైన ఆ చిన్నారులు ఇప్పుడు అమ్మమ్మను కూడా పోగొట్టుకోవడంతో అనాథలుగా మారారు. రంజాన్ పండుగ కోసం పిల్లలకు కొత్త బట్టలు కొన్న మహూబూబి, కిన్వాట్‌లో ఉన్న తన పెద్ద కూతురికి రంజాన్ బట్టలు కొనిద్దామనే ఉద్దేశంతో కిన్వాట్ బయలుదేరి మృత్యువాత పడింది.
మరో పక్క తొమ్మిదేళ్ల సానియ ఆస్పత్రిలో తీవ్రగాయాలతో చికిత్స పొందుతోంది. ఎంతో ప్రేమగా పెంచుతున్న అమ్మమ్మ చనిపోయింది..నిత్యం తనతో ఆడుకునే అక్క కనిపించక చిన్నారి ఆర్మన్‌ను చూస్తూ తాత సలీం కన్నీరుమున్నీరయ్యారు. చిన్నప్పుడు కన్న తల్లి..పెంచి పెద్ద చేస్తున్న అమ్మమ్మను కోల్పోయిన ఆ చిన్నారులను చూసి చుట్టుపక్కల వారు కన్నీటి పర్యంతమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment