భూక్యా అరుణ మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు
మహబూబాబాద్ రూరల్ : అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ పట్టణ శివారు సాలార్ తండాలో చోటుచేసుకుంది. మృతురాలి తల్లి గుగులోత్ చావ్లీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రేలకాయలపల్లి గ్రామ శివారు జేత్రాం తండాకు చెందిన గుగులోత్ చావ్లీ కుమార్తె అరుణ(27)ను మహబూబాబాద్ పట్టణ శివారు సాలార్‌తండాకు చెందిన భూక్యా కృష్ణ మహర్షికి ఇచ్చి 9 ఏళ్ల క్రితం వివాహం జరిపించారు. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వివాహం అయినప్పటి నుంచి కృష్ణమహర్షి భార్య అరుణను హింసించేవాడు. అంతేకాకుండా ఆమె మామ లక్‌పతి, మరిది బ్రహ్మమహర్షి అలియాస్ బన్ను కూడా వేధించేవారు.
గతంలో ఈ వేధింపులపై పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. అయినప్పటికీ వారు తమ పద్ధతి మార్చుకోలేదు. వేధింపుల గురించి అరుణ తన తల్లి గుగులోత్ చావ్లీకి పలుమార్లు చెప్పుకుంటూ బాధపడేది. కాగా, ఈ నెల 9వ తేదీ రాత్రి 11.30 గంటలకు భూక్యా అరుణ విషం తీసుకుందని తల్లి చావ్లీకి ఫోన్ ద్వారా ఆమె భర్త సమాచారం అందించాడు. మొదట మానుకోట ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చి అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానిక వైద్యులు హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పారు.
అయినప్పటికీ సదరు వ్యక్తులు హైదరాబాద్ తీసుకెళ్లకుండా మానుకోటలోనే అరుణకు వైద్యం చేయించారు. పరిస్థితి విషమించడంతో 10వ తేదీ ఉదయం ఆమెను హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ఆమె అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందింది. విషయం తెలుసుకున్న మృతురాలి బంధువులు అరుణ మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి మానుకోట ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు.
తన కుమార్తె మృతిపై అనుమానంగా ఉందని, ఆమెకు బలవంతంగా విషం తాగించారని, కుడి కన్నుపై బలమైన గాయం ఉందని, చెవుల నుంచి రక్తం వస్తుందని, మెడ మొత్తం కమిలిపోయి ఉందని తల్లి గుగులోత్ చావ్లీ రోదిస్తూ తెలిపింది. అరుణ మృతికి కారకులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చావ్లీ మహబూబాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. టౌన్ సీఐ జబ్బార్ ఏరియా ఆస్పత్రికి వెళ్లి అరుణ మృతదేహాన్ని సందర్శించి వివరాలు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment