కొత్తూరు (అర్ధవీడు): వరకట్నం వేధింపులకు వివాహిత బలైంది. ఈ సంఘటన మండలంలోని కొత్తూరులో శనివారం తెల్లవారు జామున జరిగింది. మృతురాలి తల్లిదండ్రుల కథనం ప్రకారం.. కొత్తూరుకు చెందిన పల్లెబోయిన ఆవులయ్యకు ఎర్రగొండపాలెం మండలం గంగుపల్లెకు చెందిన రాజేశ్వరితో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆవులయ్య తన భార్య రాజేశ్వరిని నిత్యం అదనపుకట్నం తెమ్మని వేధిస్తుంటాడు. పలు పర్యాయాలు ఆమె అలిగి తన పుట్టిల్లు వెళ్లింది. తల్లిదండ్రులు తమ కుమార్తెకు సర్ది చెప్పి మళ్లీ భర్త వద్దకు కాపురానికి పంపేవారు. భర్తతో పాటు అత్త ఆదిలక్ష్మమ్మ, మామ ఎర్రయ్యలు ఇటీవల వేధింపులు ఎక్కువ చేశారు. తీవ్ర మనస్తాపం చెందిన రాజేశ్వరి రెండు రోజుల క్రితం దోమల నివారణకు వాడే ఆలౌట్ ద్రావకం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన అత్తమామలు.. కోడలు చనిపోతే కేసు తమ మీదకు వస్తుందని భయపడి ఆమెను తొలుత అర్ధవీడులోని ఓ ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లారు.
ఆయన తన వల్ల కాదని చెప్పడంతో కంభంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో గుంటూరు తీసుకెళ్లారు. కోలుకున్న అనంతరం శుక్రవారం సాయంత్రం తిరిగి కొత్తూరు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తమ కుమార్తెను భర్త, అత్తమామలు కలిసి సంపేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఇన్‌చార్జి ఎస్‌ఐ రామానాయక్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment