నెల్లూరు జిల్లాలో ఓ ప్రైవేటు అంబులెన్స్ బీభత్సం సృష్టించింది.
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఓ ప్రైవేటు అంబులెన్స్ బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన ఉన్నవారిపై దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన నెల్లూరులోని ఇరుగాళ్లమ్మ సంఘం వద్ద శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పులీంద్ర లక్ష్మమ్మ(35), లక్ష్మి ఇద్దరు రోడ్డు పక్కన ఉన్న కుళాయి వద్ద నీళ్లు పట్టుకుంటుండగా వేగంగా దూసుకొచ్చిన అంబులెన్స్ వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పులీంద్ర లక్ష్మమ్మ అక్కడికక్కడే మృతిచెందగా.. లక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న నెల్లూరు ఎస్సై దశరధ రామారావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అంబులెన్స్ సింహపురి ఆస్పత్రికి చెందినదిగా గుర్తించారు.