మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి ధర్నా చేస్తున్న మృతురాలి బంధువులు
తూర్పుగోదావరి, పి.గన్నవరం: మండలంలోని యర్రంశెట్టి వారిపాలెం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. మోటారు సైకిల్‌ను ట్రాక్టర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మోటారు సైకిల్ నడుపుతోన్న వ్యక్తి ప్రమాదం నుంచి స్వల్ప గాయలతో బయటపడ్డాడు. పి.గన్నవరం ఎస్సై ఎస్.రాము కథనం ప్రకారం.. అల్లవరం మండలం ఓడలరేవు గ్రామానికి చెందిన లంకే లత(30) గురువారం సిద్ధాంతం గ్రామంలో బంధువుల ఇంట జరిగే శుభ కార్యక్రమానికి వెళుతోంది. పి.గన్నవరంలో బస్ దిగి రావులపాలెం వైపు వెళ్లే బస్సు కోసం ఎదురు చూస్తోంది. ఈక్రమంలో అదే శుభ కార్యక్రమానికి మోటారు సైకిలుపై వెళుతున్న ఆమె మరిది, నక్కా రామేశ్వరం గ్రామానికి చెందిన ఓలేటి జయేంద్ర స్థానిక సెంటర్లో వదినను చూసి ఆగాడు. ఆమెను మోటారు సైకిల్‌పై ఎక్కించుకుని సిద్ధాంతం గ్రామానికి బయల్దేరాడు. యర్రంశెట్టివారిపాలెం వంతెనపై ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ వీరిని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో లతకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను 108 అంబులెన్స్‌లో పి.గన్నవరం సీహెచ్‌సీకి తరలించారు. అప్పటికే ఆమె మరణించింది. మోటారు సైకిల్‌ను నడుపుతున్న జయేంద్రకు స్వల్ప గాయాలయ్యాయి. లత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో ఆమె కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. స్టేషన్ సమీపంలో ఏజీ రోడ్డుపై మృతదేహాన్ని ఉంచి ధర్నా చేశారు. ట్రాక్టర్ యజమాని నుంచి ఆర్థిక సాయం అందించి, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ట్రాక్టర్ యజమాని అందుబాటులో లేకపోవడంతో, న్యాయం చేస్తామని ఎస్సై హామీ ఇచ్చారు. లిఖిత పూరకంగా హామీ ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేశారు. ఈక్రమంలో రావులపాలెం సీఐ బి.పెద్దిరాజు ఆందోళన కారులతో చర్చించి, న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. అమలాపురం సీఏ శ్రీరామ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ఆందోళన చేసిన 18మందిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.
తల్లి మృతితో అనాథలైన పిల్లలు..
ఓడలరేవు గ్రామానికి చెందిన వికలాంగురాలైన లంకే లత భర్త గతంలో మరణించాడు. ఆమెకు తొమ్మిదేళ్ల కుమార్తె అనూష, ఐదేళ్ల కుమారుడు అభి ఉన్నారు. భర్త మరణించడంతో జీవనాధారం కోల్పోయిన లత ఓడలరేవులోని ఒక కళాశాలలో స్వీపర్‌గా పనిచేస్తూ ఇద్దరు పిల్లల్ని చదివిస్తోంది. యర్రంశెట్టివారిపాలెం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించడంతో ఇద్దరు పిల్లలు దిక్కులేని వారయ్యారు. తల్లి మృతదేహం వద్ద పిల్లలు విలపించిన తీరు అందరితో కంటతడిపెట్టించింది.
Comments
Please login to add a commentAdd a comment