
మృతి చెందిన కనకదుర్గ
సిద్దిపేటటౌన్: ముందు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేయబోయి కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం సిద్దిపేట శివారు ఇమాంబాద్ వద్ద జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం షాద్‌నగర్‌కు చెందిన రాళ్లబండి వెంకటరామరాజు కుటుంబ సభ్యులతో కలిసి గోదావరిఖనిలో ఉండే బంధువుల ఇంట్లో పెళ్లికి ఆదివారం వెళ్లారు.
పెళ్లి అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శించుకోవడానికి వెళ్లారు. దర్శనం చేసుకున్న అనంతరం షాద్‌నగర్‌కు తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో సిద్దిపేట పట్టణ శివారు ఇమాంబాద్ వద్దకు రాగానే ముందు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేయబోయిన కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న లోయలో పడిపోయింది.
ఈ ఘటనలో వెంకటరామరాజు భార్య కనకదుర్గ సీట్ బెల్ట్ ధరించకపోవడంతో ప్రమాద స్థలంలోనే మృతి చెందింది. రామరాజు, అతడి కొడుకు కృష్ణమోహన్, కోడలు మధుమిత, మనమరాలు తన్విశ్రీ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై సిద్దిపేట వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.