విషపూరిత చీమలతో చిత్రహింసలు!
కరనావి: చోరీకి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఓ కుటుంబాన్ని చెట్టుకు కట్టేసి చిత్రహింస చేయగా ఓ మహిళ మృతిచెందింది. ఓవైపు న్యూ ఇయర్ వేడుకలు జరుగుతుండగా మరోవైపు ఈ విషాదఘటన చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ దుర్ఘటన బొలివియాలోని కరనావి మునిసిపాలిటీలో చోటుచేసుకుంది. స్థానిక పోలీసు అధికారి గంటర్ అగుడో కథనం ప్రకారం.. స్థానిక కరనావి పట్టణంలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ వ్యక్తి కారును చోరీ చేశారు. చుట్టుపక్కల ఇంట్లో ఉండే ఓ యువకుడి పనేనంటూ అతడిని చెట్టుకు కట్టేశారు. యువకుడికి మద్ధతు తెలిపినందుకు సోదరితో సహా తల్లి(52)ని అదే చెట్టుకు కట్టేశారు.
కొన్ని గంటలపాటు చెట్టుకు కట్టేసి ఉంచారన్న సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి వెళ్లి ఆ ముగ్గురిని విడిపించారు. స్థానికులు విషపూరిత చీమలను వారిపై వదిలి చిత్రహింసలకు గురిచేసినట్లు అనుమానిస్తున్నారు. విషపూరిత చీమలు వారిని సజీవంగా కొరికి తినడం మొదలుపెట్టాయి. కొన్ని చీమలు వారి శరీరంపై స్వల్ప గాయాలు చేయగా, మరికొన్ని చీమలు వారి గొంతు, నోటి నుంచి శరీరంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అన్నాచెల్లెళ్ల పరిస్థితి ఒకే కానీ వీరి తల్లి పరిస్థితి విషమంగా ఉందని వెంటనే అస్పత్రికి తరలించాం. ఆ చీమలు, కీటకాలు అప్పటికే చేయాల్సిన నష్టాన్ని చేసేశాయి. మహిళ తీవ్ర శ్వాససమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు వివరించారు. నిజానికి కారు చోరీకి, ఈ ఫ్యామిలీకి సంబంధం లేదని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే బాధితుల పేర్లను వెల్లడించేందుకు వారు నిరాకరించారు.