ఓటు... దీని రూటే వేరు గురూ... | tamilnadu politics | Sakshi
Sakshi News home page

ఓటు... దీని రూటే వేరు గురూ...

Published Sat, Apr 23 2016 8:23 AM | Last Updated on Sun, Sep 3 2017 10:31 PM

ఓటు... దీని రూటే వేరు గురూ...

ఓటు... దీని రూటే వేరు గురూ...

తమిళనాడులో ప్రస్తుతం 700 ఫ్లయింగ్ స్క్వాడ్స్  తిరుగుతున్నాయి.ఎందుకో తెలుసా? ఓటర్లను ప్రలోభపెట్టేవారినీ అందుకై కానుకలు ఇచ్చేవాళ్లనీ పట్టుకోవడానికి!

 

పాత ‘వేటగాడు’ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. ‘పుట్టింటోళ్లు తరిమేశారు’... పాటలో విలన్ సత్యనారాయణ ఒకే రంగు డ్రస్సు ఆ రంగులోనే ఉన్న బూట్లు తొడుక్కుని వస్తాడు. కాసేపటికి రౌడీ సిలోన్ మనోహర్ వచ్చి అతని టేబుల్ దగ్గరే కూచుంటాడు. పాట మంచి రసపట్టులో ఉండగా ఇద్దరూ కన్ను గీటుకుంటారు. మరు నిమిషంలో ఇతని షూస్ అతని వైపు అతని షూస్ ఇతని వైపు నెట్టుకుంటారు. అంటే ఆ షూ సోల్‌లో డైమండ్స్ ఉన్నాయన్నమాట. అక్కడ స్మగ్లింగ్ జరుగుతోందన్న మాట. ప్రస్తుతం తమిళనాడులో ఓటర్లను లోబరుచుకోవడానికి ఇంతకు తక్కువ కాని కొత్త కొత్త రీతులను కనిపెట్టడానికీ కనిపెట్టి వాటిని అమలు పరచడానికి పార్టీలు, లీడర్లు, వారి లెవల్ 3, లెవల్ 4 లీడర్లు వెనుకాడటం లేదు. ఒక్క ఓటే... కాని వేయి లంచాలు.

 

 అఫీషియల్...
ఒక అధికారి చెప్పినట్టుగా ఓటరును కరప్ట్ చేయడంలో దేశంలో తమిళనాడుకు మించిన రాష్ట్రం లేదు. అక్కడ ఓటరును రెండు విధాలుగా ఆకర్షిస్తారు. ఒకటి అధికారికంగా- అంటే ఎన్నికల మేనిఫెస్టో రూపంలో. రెండు అనధికారికంగా- అంటే డబ్బు దస్కం వగైరా వగైరా. 2006 ఎన్నికలలో డి.ఎం.కె అధినేత కరుణానిధి దీనిని మొదలెట్టారు. రెండు రూపాయలకు కిలోబియ్యం పథకాన్ని ప్రకటించారు. అది చూసి ఏ.ఐ.డి.ఎం.కె. పార్టీ అధినేత్రి జయలలిత ఏకంగా అర్హులకు పది కిలోల ఉచిత బియ్యం ప్రకటించింది. అది చూసి విజయకాంత్ పార్టీ పదిహేను కిలోల ఉచిత బియ్యాన్ని వాగ్దానాన్ని చేసింది. అయితే మొదట మొదలెట్టిన డి.ఎం.కె విజయాన్ని తన్నుకుపోయింది.  2011 ఎన్నికల నాటికి జయలలిత పుంజుకుని ఈ గిఫ్ట్ ప్యాక్ రేంజ్‌ను పెంచేసింది. కలర్ టి.వి, ఫ్రిజ్, సీలింగ్ ఫ్యాన్... వీటిని ఉచితంగా అర్హులకు ప్రకటించింది. పేద విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, పేద మహిళలకు నాలుగు గ్రాముల గోల్డు, పేదింటి పిల్ల పెళ్లికి 25,000 రూపాయల నగదు... ఇక ఆ లిస్టు కొనసాగింది. ప్రస్తుత ఎన్నికలలో ఈ ఊపును డి.ఎం.డి.కె అధినేత విజయకాంత్ కొనసాగిస్తున్నారు. ఆయన ఏకంగా తాను గనక అధికారంలోకి వస్తే పెట్రోలు 45 రూపాయలకి, డీజెల్ 35 రూపాయలకి అందిస్తానని అంటున్నాడు. రాష్ట్ర పరిధిలో ఉన్న పన్నులను ఎంత మినహాయించినా పెట్రోల్ కంపెనీలు, కేంద్ర ప్రభుత్వ విధానాలకు లోబడిన పెట్రోల్ ధర 45 రూపాయలకు దిగదని  పండితులు చెబుతున్నారు. అయినా విజయకాంత్ లెక్క చేయడం లేదు. మరొకటి... ప్రతి ఏటా కనీసం ఐదు వేల మంది రైతులను విదేశాలకు పంపి వ్యవసాయంలో మెలకువలు నేర్చుకుని వచ్చేలా చేస్తానని విజయకాంత్ అంటున్నాడు. పల్లెల్లోని ప్రతి కుటుంబం నెలసరి ఆదాయం 25,000 రూపాయలకు పెంచుతానని, అందుకు కావాలంటే ప్రతి ఇంటిలోని ఒకరికి క్లర్క్ ఉద్యోగం ఇస్తానని చెబుతున్నాడు. ఇక తమిళనాడుకు చెందిన టాప్ బ్రాండ్స్, వ్యాపార సంస్థల వాళ్లు ఏ రాష్ర్టంలో అయినా ఏ దేశంలో అయినా తమ వ్యాపారాలు చేసుకోవచ్చని, అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మాట మాత్రం చెప్పాల్సిన పని లేదని అంటున్నాడు. ఈ ఆకర్షణలు ఎవరిని అందలం ఎక్కిస్తాయో చూడాలి.

 

అన్ అఫీషియల్‌గా...
తమిళనాడులో ప్రస్తుతం 700 ఫ్లయింగ్ స్క్వాడ్స్ తిరుగుతున్నాయి. ఎందుకో తెలుసా? ఓటర్లను ప్రలోభ పెట్టేవారినీ అందుకై కానుకలు ఇచ్చేవాళ్లనీ పట్టుకోవడానికి. ఇలా అక్రమంగా పంచడానికి తరలిస్తున్న డబ్బును ఇప్పటికే దాదాపు 25 కోట్లు అక్కడ అధికారులు పట్టుకున్నారు. అందుకోసం అత్యాధునిక జి.పి.ఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) ద్వారా ఎక్కడినుంచి ఫిర్యాదుదారుని ఫోన్ వస్తుందో అక్కడికి చేరుకునేందుకు నెట్‌వర్క్‌నూ స్థాపించుకున్నారు. అంటే చెన్నై టి.నగర్ నుంచి ఒక వ్యక్తి ‘మా ఏరియాలో డబ్బు పంచుతున్నారు’ అని ఫోన్ చేయగానే మూడు నుంచి ముప్పై నిమిషాల్లో అక్కడకు స్క్వాడ్ చేరుకునేలాగా ఏర్పాట్లు చేసుకున్నారు. అయినా సరే నాయకులు కొత్త కొత్త మార్గాలను కనిపెట్టడంలో ఐన్‌స్టీన్‌లను మించిపోతున్నారు.

 

మొబైల్ రీచార్జ్‌లు....
ఓటర్లకు డబ్బు కావాలి- అని నాయకులు అనుకుంటారు. డబ్బు పంచితే పట్టుకుంటారు కనుక రూ.100, రూ.200, రూ.500కు మొబైల్ రీచార్జ్ చేయిస్తారు. అంటే పరోక్షంగా డబ్బు ఇస్తారు. కొన్ని చోట్ల చిల్లర దుకాణాల కూపన్‌లు ఇస్తున్నారు. ఆ కూపన్‌లు పట్టుకొని వెళ్లి ఎంపిక చేసిన షాపుల్లో ఆ కూపన్ మొత్తానికి సరిపడా సరుకు కొనుక్కోవచ్చు. కొన్నిచోట్ల పెట్రోల్ కూపన్లు కూడా చలామణి అవుతున్నాయి. గతంలో వంద నోటు, క్వార్టర్ బాటిల్ మద్యం ఓటరును ఆకర్షించడానికి సరిపోతుందని భావించేవారు. కాని ఇప్పుడు కానుకలు శృతి మించి గంజాయి, డ్రగ్స్ వరకూ వెళుతున్నాయి. పశ్చిమ బెంగాల్ డ్రగ్స్ విషయంలో మొదటి స్థానంలో ఉంటే కేరళ చివరిస్థానంలో ఉంది. ఈసారి ఓటర్ల కోసం సెల్‌ఫోన్లు, గ్యాస్ సిలిండర్లు, బియ్యం బస్తాలు, సిఎఫ్‌ఎల్ బల్బులు, వంట పాత్రలు... ఇంకా అనేకం తయారవుతున్నాయి. నిత్యం నిఘా ఉన్నప్పటికీ పాల ప్యాకెట్ల పంపిణీని, న్యూస్‌పేపర్ల పంపిణీని నాయకులు లక్ష్యం చేసుకునే అవకాశాలున్నాయి. అంటే నేరుగా డబ్బు పంచే వీలు లేకపోతే గనక తెల్లారేసరికి పాల ప్యాకెట్‌తో పాటు దానికి గుచ్చిన ఐదు వందల నోటు లేదంటే వెయ్యి నోటు కనిపించే అవకాశం ఉంది. లేదంటే ముంగిట్లో పడే న్యూస్‌పేపర్‌లో పాంప్లెట్‌కు బదులు కరెన్సీ కనిపించవచ్చు కూడా. అందుకే పోలీసులు ఇప్పటి నుంచి పేపర్, మిల్క్ బాయ్‌లను సమావేశ పరిచి ఇలాంటి పనులు చేయవద్దని సూచిస్తున్నారు.

 

ఎలక్షన్ కమిషన్ కూడా...
ఓటర్లను ప్రలోభపెట్టే ఏ పనినీ అంగీకరించని ఎలక్షన్ కమిషన్ తను కూడా ఓటర్లను ప్రలోభ పెడుతోందా? సరదాగా అయినా అవుననే చెప్పాలి. ఎందుకంటే ఓటు వేసేందుకు యువ ఓటర్లను ఆకర్షించడానికి ఎలక్షన్ కమిషన్ ‘సెల్ఫీల కాంపిటీషన్’ పెట్టింది. ఓటు వేసిన యువతీ లేదా యువకుడు తమ ఎలక్షన్ బూత్ కనిపించేలా సెల్ఫీ తీసుకుని జిల్లా పరిపాలనకు సంబంధించిన పేజీలో పోస్ట్ చేస్తే ఉత్తమ సెల్ఫీకి బహుమతి ఇస్తానని చెబుతోంది.  అది ఒక ఆకర్షణ ఇది ఒక ఆకర్షణ... పవిత్ర భారతావనిలో ఓట్ల పండగ ఒక చిత్ర విచిత్రాల కార్ఖానా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement