మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతం
♦ తమిళనాడులో 73%, పుదుచ్చేరిలో 84%,
♦ కేరళలో 72% పోలింగ్ నమోదు
♦ గత ఎన్నికలకన్నా స్వల్పంగా తగ్గిన పోలింగ్
♦ ఎల్లుండి ఓట్ల లెక్కింపు, ఫలితాలు
సాక్షి, చెన్నై/తిరువనంతపురం: తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి.. మూడు దక్షిణాది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సోమవారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం చివరి అంచనాలు వచ్చే సరికి.. తమిళనాడులో 73.76 శాతం, పుదుచ్చేరిలో 84.11 శాతం, కేరళలో 71.7 శాతం చొప్పున పోలింగ్ నమోదైంది. అయితే.. తమిళనాడు, కేరళల్లో 2011 అసెంబ్లీ ఎన్నికలకన్నా తక్కువ పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీలో తెలిపింది.
తమిళనాడులో 201 అసెంబ్లీ ఎన్నికల్లో 78.12 శాతం, 2014 సాధారణ ఎన్నికల్లో 73.85 శాతం పోలింగ్ నమోదైందని ఉప ఎన్నికల కమిషనర్ ఉమేశ్‌సిన్హా పేర్కొన్నారు. కేరళలో కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో 75.12 శాతం, సాధారణ ఎన్నికల్లో 74.02 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. ఇక పుదుచ్చేరిలో 2011 అసెంబ్లీ ఎన్నికల్లో 75.12 శాతం, 2014 లోక్‌సభ ఎన్నికల్లో 83.05 శాతం పోలింగ్ నమోదైందన్నారు. ఈ రాష్ట్రాలతో పాటు.. పోలింగ్ ముందే పూర్తయిన పశ్చిమబెంగాల్, అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలనూ ఈ నెల 19న (గురువారం) ప్రకటించనున్నారు.
తమిళనాడులో వర్షాల మధ్య.. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 3,776 మందిఅభ్యర్థులు పోటీపడుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 6.82 కోట్ల ఓటర్లు ఉన్నారు. తంజావూరు, అరవకురిచ్చి స్థానాల్లో పోలింగ్ వాయిదా పడిన కారణంగా మిగిలిన 232 నియోజకవర్గాలకు సోమవారం పోలింగ్ నిర్వహించారు. రాష్ట్రంలోని 15 జిల్లాల్లో వర్షాలు పడటం పోలింగ్‌పై ప్రభావం చూపింది. వర్షం వల్ల విద్యుత్ సరఫరాకు విఘాతం ఏర్పడగా పలు చోట్ల పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటలకు పొడిగించారు. సీఎం అభ్యర్థులు జయలలిత, కరుణానిధి, విజయకాంత్, అన్బుమణిలతోపాటు కోలీవుడ్ నటీనటులు కమల్‌హాసన్, రజనీకాంత్ తదితరులు ఓటేశారు.
పుదుచ్చేరిలో.. కేంద్ర పాలితప్రాంతం పుదుచ్చేరిలో 84.11 శాతం పోలింగ్ నమోదైంది. వర్షాలు కురిసినప్పటికీ పోలింగ్‌పై ప్రభావం చూపలేదు. యానాంలో భారీగా పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలో 9.41 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 30 అసెంబ్లీ స్థానాలకు 344 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
కేరళలో: కేరళలో సాయంత్రం ఆరు గంటల వరకూ 71.7 శాతం పోలింగ్ నమోదయిందని ఈసీ వర్గాలు పేర్కొన్నాయి. మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు గాను 1,203 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కేరళ గవర్నర్ జస్టిస్ (మాజీ) పి.సదాశివం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయటం విశేషం. ఈ రాష్ట్ర గవర్నర్ ఓటేయడం ఇదే తొలిసారి.
ఈవీఎంలలో భవితవ్యం
Published Tue, May 17 2016 1:57 AM | Last Updated on Mon, Sep 4 2017 12:14 AM
Advertisement