కెప్టెన్‌కు షాక్!
కెప్టెన్‌కు షాక్!
Published Wed, Dec 11 2013 2:57 AM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM
సాక్షి, చెన్నై: డీఎండీకే అధినేత విజయకాంత్‌కు పెద్ద షాక్ తగిలింది. పార్టీ ప్రిసీడియం చైర్మన్, ఎమ్మెల్యే పదవులకు సీనియర్ నాయకుడు బన్రూటి రామచంద్రన్ రాజీనామా చేశారు. రాజకీయాలకు ఇక సెలవు అని ప్రకటించారు.విజయకాంత్ నేతృత్వంలో డీఎండీకే ఆవిర్భవించగానే, డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ, ఎండీఎంకే తదితర పార్టీలకు చెందిన నాయకులు వలస వచ్చారు. ఇందులో బన్రూటి రామచంద్రన్ కీలక నేత. పార్టీ ఆవిర్భావం నుంచి విజయకాంత్ వెన్నంటే ఉంటూ వచ్చారు. పార్టీ ప్రిసీడియం చైర్మన్‌గా బన్రూటీ, సీనియర్లుగా సుందరరాజన్, పాండియరాజన్, ఆస్టిన్ తదితరులు వ్యవహరించారు. పార్టీలో విజయకాంత్ సతీమణి ప్రేమలత , బావమరిది సుదీష్ జోక్యం క్రమంగా పెరగడంతో సీనియర్లు ఒకరి తర్వాత మరొకరు తప్పుకుంటూ వచ్చారు. సుందరరాజన్, పాండియరాజన్‌తో పాటుగా ఎందరో గుడ్ బై చెప్పి బయటకు వెళ్లినా, పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రెబల్స్‌గా మారుతున్నా,
బన్రూటి మాత్రం మౌనంగానే ఉంటూ వచ్చారు. విజయకాంత్ ప్రధాన ప్రతి పక్ష నేతగా ఎదగడంలో కీలక భూమిక పోషించిన బన్రూటికి పార్టీలో మాత్రం ఎన్నో అవమానాలు ఎదురైనట్లు వార్తలు వచ్చాయి. వీటికి అద్దం పట్టే విధంగా పార్టీ కార్యక్రమాలకు కొంత కాలంగా బన్రూటి దూరంగా ఉంటున్నారు. అరుుతే రెండు రోజుల క్రితం బ్రనూటి విజయకాంత్‌కు గట్టి షాక్ ఇచ్చే నిర్ణయాన్ని తీసుకున్నారు. సీనియర్ నేతగా తన విజ్ఞతను చాటుకుంటూ, వివాదాల జోలికి వెళ్లకుండా, ఎవరి మనస్సు నొప్పించకుండా ఏకంగా రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు మంగళవారం ఆయన ప్రకటించారు. రాజీనామా: ఎమ్మెల్యే పదవికి, శాసనసభ ప్రధాన ప్రతి పక్ష ఉప నేత పదవికి రాజీనామా చేస్తూ అసెంబ్లీ స్పీకర్ ధనపాల్, కార్యదర్శి జమాలుద్దీన్‌కు బన్రూటి లేఖ రాసినట్టు వెలుగు చూసింది.
ఆయన రాజీనామాను ఆమోదిస్తూ స్పీకర్ ధనపాల్ నిర్ణయం తీసుకున్న సమాచారంతో మీడియా బన్రూటి నివాసానికి పరుగులు తీసింది. దీంతో తాను తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరిస్తూ బన్రూటి మీడియాతో మాట్లాడారు. పార్టీ సభ్యత్వానికి, ప్రిసీడియం చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేసినట్టు ప్రకటించారు. అసంతృప్తి: మీడియా గుచ్చి గుచ్చి ప్రశ్నల్ని సంధించినా, వివాదాల జోళికి వెళ్లకుండా ఆయన మాట్లాడారు. పార్టీలో అవమానాల్ని , ఇబ్బందుల్ని ఎదుర్కొన్నట్టు వార్తలు వచ్చారుుగా..? అని ప్రశ్నించగా చిరునవ్వే సమాధానంగా చెప్పారు. వివాదాల జోళికి వెళ్ల దలచుకోలేదని, పార్టీని నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఒకర్ని నిందించడం లేదా, విమర్శించడం మంచి పద్దతి కాదంటూ దాట వేశారు.
విజయకాంత్‌కు ముందే తెలుసా అని ప్రశ్నించగా, తెలిస్తే ఆయన అంగీకరించేవారు కాద న్నారు. విజయకాంత్‌కు తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని, తన మీద ఎవరి ఒత్తిడి లేదని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఒక్క విషయం మాత్రం చెప్పదలచుకున్నాననంటూ డీఎండీకే తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆవిర్భావ కాలంలో ఉన్న పరిస్థితులు ప్రస్తుతం అక్కడ లేవని, దాన్ని మార్చుకోకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. చివరకు, తాను అనారోగ్య కారణాలతో రాజకీయూలకు దూరమవుతున్నట్లు ప్రకటించారు.
ఇంత వరకు తనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ముగించారు. అయితే బన్రూటి రాజీనామాతో అలంధూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాబోతుంది. బన్రూటి వైదొలగడంతో ఇక డీఎండీకే మరింత గట్టి పరిస్థితుల్ని ఎదుర్కోవడం తథ్యం. బన్రూటికి అనుకూల ఎమ్మెల్యేలు అనేక మంది ఆ పార్టీలో ఉన్నారు. వీరంతా రెబల్స్ అవతారం ఎత్తడం ఖాయం. ఈ దృష్ట్యా, మరి కొద్ది రోజుల్లో విజయకాంత్ ప్రధాన ప్రతి పక్ష నేత పదవికి గండం తప్పదేమో...!
Advertisement