Panruti Ramachandran
-
బన్రూటితో బంతాట.. పదవి నుంచి తప్పించిన పళణి స్వామి!
సాక్షి, చెన్నై : తమిళ రాజకీయాల్లో సీనియర్ నాయకుడైన బన్రూటి రామచంద్రన్‌తో అన్నాడీఎంకే ముఖ్య నేతలు మంగళవారం బంతాట ఆడుకున్నారు. ఓ వర్గం నేతగా ఉన్న పళణిస్వామి బన్రూటిని పదవీ నుంచి తప్పిస్తే.. మరో వర్గం నేత పన్నీరు సెల్వం ఆయనకు కొత్త పదవిని కట్టబెట్టారు. ఈ పరిణామాలు అన్నాడీఎంకే కేడర్‌ను విస్మయానికి గురి చేశాయి. బన్రూటి రామచంద్రన్ తొలుత డీఎంకేలో, అనంతరం ఎంజీయార్ నేతృత్వంలోని అన్నాడీఎంకేలో సుదీర్ఘ రాజకీయ ప్రయాణం సాగించారు. ఎంజీయార్‌కు అత్యంత విధేయుడిగా ఉన్న ఆయన జయలలిత రాకతో ఆ పార్టీకి దూరమయ్యారు. 2005లో సినీ నటుడు విజయకాంత్ నేతృత్వంలో డీఎండీకే ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించారు. విజయకాంత్‌కు వెన్నుదన్నుగా ఉంటూ వచ్చారు. విజయకాంత్‌ను ప్రధాన ప్రతిపక్ష నేత స్థాయికి తీసుకెళ్లడంలో బన్రూటి కీలక పాత్ర పోషించారనంలో అతిశయోక్తి లేదు. చివరకు ఆ పార్టీలో సాగిన కుట్ర పూరిత రాజకీయాలను చూసి బయటకు వచ్చేశారు. అదే సమయంలో బన్రూటి సేవలను పార్టీకి ఉపయోగించుకునేందుకు గతంలో సీఎం జయలలిత నిర్ణయించారు. ఆయన్ని అన్నాడీఎంకేలోకి తీసుకొచ్చి గౌరవప్రదమైన పదవి అప్పగించారు. ఊడిన నిర్వాహక కార్యదర్శి పదవి జయలలిత మరణం తదుపరి పరిణామాలతో అన్నాడీఎంకేలో ఉన్నా, రాజకీయంగా పూర్తిస్థాయిలో బన్రూటి ముందుకు సాగలేదు. ఇటీవల కాలంలో అన్నాడీఎంకేలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆయన్ని తీవ్రంగా కలిచి వేశాయి. ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణి స్వామి చర్యలను ఓ సమావేశంలో బన్రూటి వ్యతిరేకించారు. అదే సమయంలో అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వంకు మద్దతుగా స్పందించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయనతో ఈ ఇద్దరు నేతలు బంతాట ఆడే పరిస్థితి నెలకొంది. పన్నీరుకు మద్దతుగా వ్యవహరిస్తున్న బన్రూటి రామచంద్రన్‌ను పార్టీ నిర్వాహక కార్యదర్శి పదవి నుంచి మంగళవారం తప్పించారు. అలాగే పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తూ పళణి స్వామి ప్రకటన చేశారు. వెంటనే స్పందించిన పన్నీరు సెల్వం తన శిబిరం తరపున అన్నాడీఎంకేకు రాజకీయ సలహదారుడిగా బన్రూటిని నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఈ పరిణామాలు అన్నాడీఎంకే కేడర్‌ను అయోమయానికి గురి చేశాయి. అయితే, ఓ సీనియర్ నేతతో ఇలాగేనా వ్యవహరించడం అనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉండగా పళణిస్వామి నేతృత్వంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ పన్నీర్‌సెల్వం సుప్రీంకోర్టు తలుపు తట్టిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ ఈ నెల 30వ తేదీన విచారణకు రానుంది. -
పన్నీర్ సెల్వం గ్రూప్‌పై త్వరలోనే వేటు!
శశికళ ఎన్నిక నిబంధనలకు విరుద్ధం కాదు చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా వీకే శశికళ ఎన్నిక పార్టీ నిబంధనలకు లోబడి జరిగిందని ఆ పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి పన్రుత్తి ఎస్ రామచంద్రన్ బుధవారం పేర్కొన్నారు. శశికళ ఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘించి శశికళను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారంటూ ఆ పార్టీ బహిష్కృత ఎంపీ శశికళ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఈసీ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా శశికళకు ఎదురుతిరిగి.. మాజీ సీఎం పన్నీర్ సెల్వం గ్రూపులో చేరిన పదిమంది ఎమ్మెల్యేలపై సరైన సమయంలో వేటు వేస్తామని, పార్టీ విప్ ధిక్కరించిన వారిపై చర్య తప్పదని ఆయన పేర్కొన్నారు. పళనిస్వామికి వ్యతిరేకంగా డీఎంకే రాద్ధాంతం చేస్తున్నదని, అసెంబ్లీలో జరిగిన బలపరీక్ష చట్టబద్ధమైనదేనని అన్నారు. -
అన్నాడీఎంకేలోకి బన్రూటి
సాక్షి, చెన్నై: సీనియర్ రాజకీయ నాయకుడు బన్రూటి రామచంద్రన్ త్వరలో అన్నాడీఎంకే లో చేరబోతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపు కోసం శ్రమించేందుకు సిద్ధమవుతున్నారు. అన్నా బిరుదుకు తనను ఎంపిక చేయడంతో బన్రూటి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. రాష్ట్రంలోని సీనియర్ రాజకీయ నాయకుల్లో బన్రూటి రామచంద్రన్ ఒకరు. తొలుత డీఎంకేలో, అనంతరం ఎంజియార్ నేతృత్వంలోని అన్నాడీఎంకేలో తన రాజకీయ సేవల్ని అందించారు. 2005లో విజయకాంత్ నేతృత్వంలో డీఎండీకే ఆవిర్భవించినప్పటి నుంచి ఆ పార్టీకి వెన్ను దన్నుగా ఉంటూ వచ్చారు. విజయకాంత్‌ను ప్రధాన ప్రతి పక్ష నేత స్థాయికి తీసుకెళ్లడంలో బన్రూటి కీలక పాత్ర పోషించారు. అయితే, ఆ పార్టీలో రాజకీయాలు పెరగడం బన్రూటిలో ఆవేదనను రగిల్చింది. ఆ పార్టీ ప్రిసీడియం చైర్మన్ పదవికి, ఎమ్మెల్యే, శాసన సభా పక్ష ఉప నేత పదవులకు గత ఏడాది చివర్లో ఆయన రాజీనామా చేశారు. రాజకీయూల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఎవర్నీ నిందించకుండా, పార్టీని కాపాడుకో? అంటూ విజయకాంత్‌కు పరోక్ష సంకేతాలు ఇచ్చారు. అనారోగ్య కారణాల వల్ల తాను రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్టు బన్రూటి ప్రకటించినా, ఆయన సేవల్ని తమ పార్టీకి ఉపయోగించుకునేందుకు అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత వ్యూహ రచన చేశారు. దీంతో రాజకీయ సెలవు నిర్ణయంపై బన్రూటి పునఃసమీక్షలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో తిరువళ్లూరు దినోత్సవాన్ని పురస్కరించుకుని బన్రూటికి దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి అన్నా బిరుదును ప్రభుత్వం ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఇక, అన్నాడీఎంకేలోకి బన్రూటి చేరినట్టు ప్రచారం వేగం పుంజుకుంది. ఇందుకు తగ్గట్టుగానే బుధవారం బన్రూటి స్పందించడం గమనార్హం. గెలుపునకు కృషి: తనకు అన్నా బిరుదు దక్కుతుందని కలలో కూడా ఊహించ లేదని బన్రూటి ఆనందం వ్యక్తం చేశారు. తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది అన్నా అని, ఆయన పేరిట ఉన్న ఈ బిరుదు తనకు ఇవ్వడం వెలకట్ట లేనిదిగా పేర్కొన్నారు. అన్నాతో కలసి అడుగులు వేసిన తనకు ఇంత పెద్ద బిరుదును ఇచ్చిన సీఎం జయలలిత రుణం తీర్చుకోలేనిదంటూ ప్రశంసలు కురిపించారు. అన్నా ఆశయ సాధనే లక్ష్యంగా, అన్నా అడుగు జాడల్లో నడుస్తున్న ఏకైక ప్రభుత్వం అన్నాడీఎంకేదేనని కితాబు ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల ద్వారా ఢిల్లీలో అన్నాడీఎంకే ఖ్యాతి ఎలుగెత్తి చాటడం లక్ష్యంగా పురట్చి తలైవి(విప్లవ నాయకురాలు)ఉన్నారని, ఈ లక్ష్య సాధనలో తాను భాగస్వామిని అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. బృహత్తర ఆశయంతో ముందుకెళుతున్న సీఎం జయలలిత కలనెరవేర్చడం కోసం ఆ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానని ప్రకటించారు. అనారోగ్య కారణాలు ఉన్నా, పూర్తి స్థాయిలో కాకుండా, కొన్ని చోట్లైనా తన సేవల్ని అందించేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించారు. దీన్ని బట్టి చూస్తే, త్వరలో అన్నాడీఎంకే తీర్థం బన్రూటి పుచ్చుకోవడం ఖాయం అనిపిస్తున్నది. -
కెప్టెన్‌కు షాక్!
సాక్షి, చెన్నై: డీఎండీకే అధినేత విజయకాంత్‌కు పెద్ద షాక్ తగిలింది. పార్టీ ప్రిసీడియం చైర్మన్, ఎమ్మెల్యే పదవులకు సీనియర్ నాయకుడు బన్రూటి రామచంద్రన్ రాజీనామా చేశారు. రాజకీయాలకు ఇక సెలవు అని ప్రకటించారు.విజయకాంత్ నేతృత్వంలో డీఎండీకే ఆవిర్భవించగానే, డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ, ఎండీఎంకే తదితర పార్టీలకు చెందిన నాయకులు వలస వచ్చారు. ఇందులో బన్రూటి రామచంద్రన్ కీలక నేత. పార్టీ ఆవిర్భావం నుంచి విజయకాంత్ వెన్నంటే ఉంటూ వచ్చారు. పార్టీ ప్రిసీడియం చైర్మన్‌గా బన్రూటీ, సీనియర్లుగా సుందరరాజన్, పాండియరాజన్, ఆస్టిన్ తదితరులు వ్యవహరించారు. పార్టీలో విజయకాంత్ సతీమణి ప్రేమలత , బావమరిది సుదీష్ జోక్యం క్రమంగా పెరగడంతో సీనియర్లు ఒకరి తర్వాత మరొకరు తప్పుకుంటూ వచ్చారు. సుందరరాజన్, పాండియరాజన్తో పాటుగా ఎందరో గుడ్ బై చెప్పి బయటకు వెళ్లినా, పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రెబల్స్‌గా మారుతున్నా, బన్రూటి మాత్రం మౌనంగానే ఉంటూ వచ్చారు. విజయకాంత్ ప్రధాన ప్రతి పక్ష నేతగా ఎదగడంలో కీలక భూమిక పోషించిన బన్రూటికి పార్టీలో మాత్రం ఎన్నో అవమానాలు ఎదురైనట్లు వార్తలు వచ్చాయి. వీటికి అద్దం పట్టే విధంగా పార్టీ కార్యక్రమాలకు కొంత కాలంగా బన్రూటి దూరంగా ఉంటున్నారు. అరుుతే రెండు రోజుల క్రితం బ్రనూటి విజయకాంత్‌కు గట్టి షాక్ ఇచ్చే నిర్ణయాన్ని తీసుకున్నారు. సీనియర్ నేతగా తన విజ్ఞతను చాటుకుంటూ, వివాదాల జోలికి వెళ్లకుండా, ఎవరి మనస్సు నొప్పించకుండా ఏకంగా రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు మంగళవారం ఆయన ప్రకటించారు. రాజీనామా: ఎమ్మెల్యే పదవికి, శాసనసభ ప్రధాన ప్రతి పక్ష ఉప నేత పదవికి రాజీనామా చేస్తూ అసెంబ్లీ స్పీకర్ ధనపాల్, కార్యదర్శి జమాలుద్దీన్‌కు బన్రూటి లేఖ రాసినట్టు వెలుగు చూసింది. ఆయన రాజీనామాను ఆమోదిస్తూ స్పీకర్ ధనపాల్ నిర్ణయం తీసుకున్న సమాచారంతో మీడియా బన్రూటి నివాసానికి పరుగులు తీసింది. దీంతో తాను తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరిస్తూ బన్రూటి మీడియాతో మాట్లాడారు. పార్టీ సభ్యత్వానికి, ప్రిసీడియం చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేసినట్టు ప్రకటించారు. అసంతృప్తి: మీడియా గుచ్చి గుచ్చి ప్రశ్నల్ని సంధించినా, వివాదాల జోళికి వెళ్లకుండా ఆయన మాట్లాడారు. పార్టీలో అవమానాల్ని , ఇబ్బందుల్ని ఎదుర్కొన్నట్టు వార్తలు వచ్చారుుగా..? అని ప్రశ్నించగా చిరునవ్వే సమాధానంగా చెప్పారు. వివాదాల జోళికి వెళ్ల దలచుకోలేదని, పార్టీని నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఒకర్ని నిందించడం లేదా, విమర్శించడం మంచి పద్దతి కాదంటూ దాట వేశారు. విజయకాంత్‌కు ముందే తెలుసా అని ప్రశ్నించగా, తెలిస్తే ఆయన అంగీకరించేవారు కాద న్నారు. విజయకాంత్‌కు తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని, తన మీద ఎవరి ఒత్తిడి లేదని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఒక్క విషయం మాత్రం చెప్పదలచుకున్నాననంటూ డీఎండీకే తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆవిర్భావ కాలంలో ఉన్న పరిస్థితులు ప్రస్తుతం అక్కడ లేవని, దాన్ని మార్చుకోకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. చివరకు, తాను అనారోగ్య కారణాలతో రాజకీయూలకు దూరమవుతున్నట్లు ప్రకటించారు. ఇంత వరకు తనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ముగించారు. అయితే బన్రూటి రాజీనామాతో అలంధూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాబోతుంది. బన్రూటి వైదొలగడంతో ఇక డీఎండీకే మరింత గట్టి పరిస్థితుల్ని ఎదుర్కోవడం తథ్యం. బన్రూటికి అనుకూల ఎమ్మెల్యేలు అనేక మంది ఆ పార్టీలో ఉన్నారు. వీరంతా రెబల్స్ అవతారం ఎత్తడం ఖాయం. ఈ దృష్ట్యా, మరి కొద్ది రోజుల్లో విజయకాంత్ ప్రధాన ప్రతి పక్ష నేత పదవికి గండం తప్పదేమో...!