
పళణి, బన్రూటి, పన్నీరు(ఫైల్)
సాక్షి, చెన్నై : తమిళ రాజకీయాల్లో సీనియర్ నాయకుడైన బన్రూటి రామచంద్రన్‌తో అన్నాడీఎంకే ముఖ్య నేతలు మంగళవారం బంతాట ఆడుకున్నారు. ఓ వర్గం నేతగా ఉన్న పళణిస్వామి బన్రూటిని పదవీ నుంచి తప్పిస్తే.. మరో వర్గం నేత పన్నీరు సెల్వం ఆయనకు కొత్త పదవిని కట్టబెట్టారు. ఈ పరిణామాలు అన్నాడీఎంకే కేడర్‌ను విస్మయానికి గురి చేశాయి. బన్రూటి రామచంద్రన్ తొలుత డీఎంకేలో, అనంతరం ఎంజీయార్ నేతృత్వంలోని అన్నాడీఎంకేలో సుదీర్ఘ రాజకీయ ప్రయాణం సాగించారు. ఎంజీయార్‌కు అత్యంత విధేయుడిగా ఉన్న ఆయన జయలలిత రాకతో ఆ పార్టీకి దూరమయ్యారు.
2005లో సినీ నటుడు విజయకాంత్ నేతృత్వంలో డీఎండీకే ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించారు. విజయకాంత్‌కు వెన్నుదన్నుగా ఉంటూ వచ్చారు. విజయకాంత్‌ను ప్రధాన ప్రతిపక్ష నేత స్థాయికి తీసుకెళ్లడంలో బన్రూటి కీలక పాత్ర పోషించారనంలో అతిశయోక్తి లేదు. చివరకు ఆ పార్టీలో సాగిన కుట్ర పూరిత రాజకీయాలను చూసి బయటకు వచ్చేశారు. అదే సమయంలో బన్రూటి సేవలను పార్టీకి ఉపయోగించుకునేందుకు గతంలో సీఎం జయలలిత నిర్ణయించారు. ఆయన్ని అన్నాడీఎంకేలోకి తీసుకొచ్చి గౌరవప్రదమైన పదవి అప్పగించారు.
ఊడిన నిర్వాహక కార్యదర్శి పదవి
జయలలిత మరణం తదుపరి పరిణామాలతో అన్నాడీఎంకేలో ఉన్నా, రాజకీయంగా పూర్తిస్థాయిలో బన్రూటి ముందుకు సాగలేదు. ఇటీవల కాలంలో అన్నాడీఎంకేలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆయన్ని తీవ్రంగా కలిచి వేశాయి. ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణి స్వామి చర్యలను ఓ సమావేశంలో బన్రూటి వ్యతిరేకించారు. అదే సమయంలో అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వంకు మద్దతుగా స్పందించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయనతో ఈ ఇద్దరు నేతలు బంతాట ఆడే పరిస్థితి నెలకొంది. పన్నీరుకు మద్దతుగా వ్యవహరిస్తున్న బన్రూటి రామచంద్రన్‌ను పార్టీ నిర్వాహక కార్యదర్శి పదవి నుంచి మంగళవారం తప్పించారు.
అలాగే పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తూ పళణి స్వామి ప్రకటన చేశారు. వెంటనే స్పందించిన పన్నీరు సెల్వం తన శిబిరం తరపున అన్నాడీఎంకేకు రాజకీయ సలహదారుడిగా బన్రూటిని నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఈ పరిణామాలు అన్నాడీఎంకే కేడర్‌ను అయోమయానికి గురి చేశాయి. అయితే, ఓ సీనియర్ నేతతో ఇలాగేనా వ్యవహరించడం అనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉండగా పళణిస్వామి నేతృత్వంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ పన్నీర్‌సెల్వం సుప్రీంకోర్టు తలుపు తట్టిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ ఈ నెల 30వ తేదీన విచారణకు రానుంది.