సాక్షి, చెన్నై: ఏఐఏడీఎంకే నేత ఓ పన్నీర్‌సెల్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. చెన్నైలోని వనగరంలో సోమవారం జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో జయలలిత మరణం తర్వాత ఎడప్పాడి పళనిస్వామి, ఓ పన్నీర్ సెల్వం వర్గాల మధ్య సయోధ్య కోసం ఏర్పాటు చేసిన ద్వంద్వ నాయకత్వ విధానాన్ని రద్దు చేశారు. పార్టీకి ఎకైక తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి(ఈపీఎస్) ఎన్నికయ్యారు. దీంతో పార్టీ పగ్గాలు పళనిస్వామి చేతులోకి చేరాయి. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి పునరుద్ధరించి.. కోఆర్టినేటర్, సంయుక్త కోఆర్డినేటర్ పోస్టులను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో మొత్తం 16 తీర్మానాలకు ఆమోదం తెలిపారు.
#UPDATE | AIADMK passes a resolution to remove O Paneerselvam from party's primary membership at E Palaniswami-led General Council meeting in Vanagaram, Tamil Nadu pic.twitter.com/vigbNP32df
— ANI (@ANI) July 11, 2022
ఈ సందర్భంగా అన్నాడీఎంకే పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి పన్నీర్ సెల్వాన్ని తొలగించాలని ఎమ్మెల్యే నాథం విశ్వనాథన్ ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. పన్నీర్ సెల్వాన్ని పార్టీ ముఖ్య పదవులు, సభ్యత్వం నుంచి తొలగిస్తూ అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ తీర్మానించింది. ఓపీఎస్‌పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఓపీఎస్ మద్దతుదారులపైనా బహిష్కరణ వేటు పడింది. పదవులు, సభ్యత్వం నుంచి ఓపీఎస్ మద్దతురాలను తొలగిస్తూ తీర్మానించింది. ఓపీఎస్‌తోపాటు వైతిలింగం, జేసీడీ ప్రభాకర్, పీహెచ్ మనోజ్ పాండియన్ కూడా బహిష్కరణకు గురయ్యారు.
చదవండి: అన్నాడీఎంకే కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. పళనిస్వామి ఫోటోపై చెప్పుతో దాడి
ఏకైక పార్టీ అన్నాడీఎంకేనే
పార్టీలో ఒకే నాయకత్వాన్ని తీసుకురావాలని జనరల్ కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారని అన్నాడీఎంకే నేత పళనిస్వామి అన్నారు. దేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేస్తున్న ఏకైక పార్టీ అన్నాడీఎంకే అని పేర్కొన్నారు. తన చిత్తశుద్ధితో కూడిన పనులను చూసి దివంగత సీఎం జయలలిత రహదారులు & పీడబ్ల్యూడీ వంటి శాఖలను ఇచ్చారని గుర్తు చేశారు. మంత్రిగా ప్రజల కోసం అనేక పథకాలు తీసుకొచ్చానని పేర్కొన్నారు. ఆ పథకాలనే ప్రస్తుతం సీఎం స్టాలిన్ తమ పార్టీ స్టిక్కర్లను అతికించి ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.
కాగా ఓపీఎస్‌గా ప్రసిద్ధి చెందిన పన్నీర్ సెల్వం మూడుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆగస్టు 21, 2017 నుంచి అన్నాడీఎంకే సమన్వయకుడిగానూ వ్యవహరిస్తున్నారు. అక్రమాస్తుల కేసులో జయలలితను ముఖ్యమంత్రి పదవికి అనర్హురాలిగా కోర్టు రెండుసార్లు నిర్థారించడంతో పన్నీర్‌సెల్వం తమిళనాడు 7వ ముఖ్యమంత్రిగా(వ్యక్తుల పరంగా) సేవలందించారు. జయలలితకు బదులుగా సీఏం పీఠాన్ని ఆయన రెండుసార్లు అధిరోహించారు. జయలలిత మరణానంతరం ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2 నెలలు గడిచిన తర్వాత తన పదవికి రాజీనామా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment