పన్నీరు సెల్వం, పళని స్వామి (ఫైల్)
సాక్షి, చెన్నై: ప్రతిపక్ష నాయకుడు పళనిస్వామికి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవికి ఎంపికయ్యేందుకు ముందుగా ఆ పార్టీ సమన్వయ కమిటీ కో– కన్వీనర్ పదవికి ఆయన చేసిన రాజీనామా కొత్త సమస్యగా మారింది. ఈ రాజీనామాపై సీఈసీ విచారణకు నిర్ణయించినట్లు సమాచారం. దీంతో ఈ రాజీనామాను ఆమోదించాలని కోరుతూ పన్నీరు సెల్వం సీఈసీకి లేఖ రాసినట్లు శనివారం వెలుగు చూసింది.
అన్నాడీఎంకేలో పన్నీరు సెల్వం, పళని స్వామి శిబిరాల మధ్య వివాదం ఆసక్తికరంగా మారుతోంది. సర్వసభ్య సమావేశం చెల్లదని రెండు రోజుల క్రితం హైకోర్టు ప్రకటించడంతో పళనిస్వామికి పెద్దషాక్ తగిలింది. దీంతో పన్నీరు సెల్వం వ్యూహాలకు పదును పెట్టారు. ఓ వైపు కలిసి పనిచేద్దామని పిలుపునిస్తూనే.. మరోవైపు పళని స్వామికి ఎలాగైనా చెక్ పెట్టాలనే మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా సీఈసీకి గత నెల పళనిస్వామి రాసిన లేఖ ప్రస్తుతం పన్నీరుకు అస్త్రంగా మారింది.
ఆమోదించండి..
అన్నాడీఎంకే సర్వ సభ్య సమావేశంలో పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా గత నెల పళనిస్వామి ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సమయంలో తన చేతిలో ఉన్న అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కో– కన్వీనర్ పదవిని ఆయన రాజీనామా చేశారు. ఈ వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు(సీఈసీ) లేఖ ద్వారా పంపించారు. ఇన్నాళ్లూ పెండింగ్‌లో ఉన్న ఈ వ్యవహారాన్ని ప్రస్తుతం ఎస్‌ఈసీ విచారించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం కోర్టు తీర్పుతో తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవి దూరం కావడంతో డీలా పడిన పళనికి, ఈ రాజీనామా లేఖ కొత్త చిక్కులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చదవండి: పన్నీరు సెల్వానికి షాకిచ్చిన పళనిస్వామి.. తమిళ పాలిటిక్స్‌లో ట్విస్ట్
కో– కన్వీనర్‌గా వైద్యలింగం
పళనిస్వామి రాజీనామా నేపథ్యంలో ఆ పదవిని తన సన్నిహితుడు, ఎమ్మెల్యే వైద్యలింగంకు అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ హోదాలో పన్నీరుసెల్వం కేటాయించారు. కోర్టు తీర్పుతో ప్రస్తుతం పార్టీకి పెద్ద దిక్కుగా సమన్వయ కమిటీ మారడంతో పళనికి ఒక దాని తర్వాత మరొకటి చొప్పున సమస్యలు ఎదురు కాబోతున్నట్లు కనిపిస్తోంది. ఇందుకు కారణం, పళని స్వామి పంపించిన రాజీనామా లేఖను ఆమోదించాలని సీఈసీకి పన్నీరు సెల్వం లేఖ ద్వారా కోరడమే. ఒకవేళ సీఈసీ పళని రాజీనామాను ఆమోదించిన పక్షంలో, ఆయనకు పార్టీలో ఎలాంటి పదవి లేకుండా పోయినట్టే. ఇక పార్టీ కో– కన్వీనర్‌గా వైద్యలింగం కొనసాగే అవకాశాలు ఎక్కువే. ఈ పరిణామా లు పళని శిబిరంలో కలవరం రేపుతున్నాయి.
మంతనాల్లో పన్నీరు..
హైకోర్టు తీర్పుతో పార్టీ వ్యవహారాలు తన గుప్పెట్లోకి రావడంతో పన్నీరు దూకుడు పెంచారు. జిల్లా కార్యదర్శులతో సమావేశాలు విస్తృతం చేశారు. శనివారం తన నివాసంలో ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. తదుపరి కార్యచరణపై దృష్టి పెట్టారు. తాజా పరిణామాల నేపథ్యంలో పళని స్వామి ఒంటరిగా ఏమీ చేయలేని పరిస్థితి ఉందని, ఈ దృష్ట్యా, మరింత దూకుడుగా ముందుకు సాగి, కేడర్‌ను తమ వైపునకు తిప్పుకునే వ్యూహాలకు పన్నీరు శిబిరం పదును పెట్టినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment