![Palaniswami says That Neither Any Alliance Nor Support To BJP - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/21/Palaniswami.jpg.webp?itok=jQgBzaZ9)
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి
సాక్షి, చెన్నై: బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ తాము పొత్తు పెట్టుకునేది లేదని తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే నేత ఎడపాడి పళనిస్వామి స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా తమ వైఖరి ఏంటన్నది సీఎం పళనిస్వామి వివరించారు. కావేరి నదీ జలాల వినియోగం విషయంలో కేంద్రంపై అన్నాడీఎంకే ప్రభుత్వం మెతక వైఖరి ప్రదర్శిస్తుందంటూ ప్రతిపక్ష డీఎంకే తీవ్ర విమర్శలు చేసింది.
కావేరీ జలాల పంపకాలపై గత ఫిబ్రవరి 16న కావేరీ నిర్వహణ బోర్డు (సీఎంబీ) ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తీర్పు వెల్లడించింది. ఆరు వారాల్లోగా కమిటీ నియమించి వివరాలు వెల్లడించాలని కోర్టు సూచించింది. కావేరీ నీటి నిర్వహణ కమిటీ ఏర్పాటు చేయాలంటూ మార్చి 15న తమిళనాడు ప్రభుత్వం ఎన్డీఏ సర్కార్‌ను కోరిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు చెప్పిన ఆ బోర్డు ఏర్పాటు చేస్తే కావేరీ జలాల్లో తమిళనాడు వాటా తగ్గుతుంది. దీంతో కేంద్రంతో కుమ్మక్కయి అన్నాడీఎంకే నేతలు కావేరీ బోర్డు ఏర్పాటు కోరుకుంటున్నారని ప్రతిపక్ష డీఎంకే విమర్శించింది.
డీఎంకే ఆరోపణలపై సభలో బుధవారం పళనిస్వామి స్పందిస్తూ.. బీజేపీకి తాము మద్దతు తెలపడం గానీ, ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ఉద్దేశం గానీ అన్నాడీఎంకేకు లేదని వెల్లడించారు. కావేరీ జలాల్లో తమిళనాడు వాటాను తగ్గించకూడదని అన్నాడీఎంకే ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో తమ నిరసన తెలుపుతున్నారని పళనిస్వామి శాసనసభలో వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment