అన్నాడీఎంకేలోకి బన్రూటి
Published Thu, Jan 16 2014 5:33 AM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM
సాక్షి, చెన్నై: సీనియర్ రాజకీయ నాయకుడు బన్రూటి రామచంద్రన్ త్వరలో అన్నాడీఎంకే లో చేరబోతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపు కోసం శ్రమించేందుకు సిద్ధమవుతున్నారు. అన్నా బిరుదుకు తనను ఎంపిక చేయడంతో బన్రూటి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. రాష్ట్రంలోని సీనియర్ రాజకీయ నాయకుల్లో బన్రూటి రామచంద్రన్ ఒకరు. తొలుత డీఎంకేలో, అనంతరం ఎంజియార్ నేతృత్వంలోని అన్నాడీఎంకేలో తన రాజకీయ సేవల్ని అందించారు. 2005లో విజయకాంత్ నేతృత్వంలో డీఎండీకే ఆవిర్భవించినప్పటి నుంచి ఆ పార్టీకి వెన్ను దన్నుగా ఉంటూ వచ్చారు. విజయకాంత్‌ను ప్రధాన ప్రతి పక్ష నేత స్థాయికి తీసుకెళ్లడంలో బన్రూటి కీలక పాత్ర పోషించారు. అయితే, ఆ పార్టీలో రాజకీయాలు పెరగడం బన్రూటిలో ఆవేదనను రగిల్చింది.
ఆ పార్టీ ప్రిసీడియం చైర్మన్ పదవికి, ఎమ్మెల్యే, శాసన సభా పక్ష ఉప నేత పదవులకు గత ఏడాది చివర్లో ఆయన రాజీనామా చేశారు. రాజకీయూల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఎవర్నీ నిందించకుండా, పార్టీని కాపాడుకో? అంటూ విజయకాంత్‌కు పరోక్ష సంకేతాలు ఇచ్చారు. అనారోగ్య కారణాల వల్ల తాను రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్టు బన్రూటి ప్రకటించినా, ఆయన సేవల్ని తమ పార్టీకి ఉపయోగించుకునేందుకు అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత వ్యూహ రచన చేశారు. దీంతో రాజకీయ సెలవు నిర్ణయంపై బన్రూటి పునఃసమీక్షలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో తిరువళ్లూరు దినోత్సవాన్ని పురస్కరించుకుని బన్రూటికి దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి అన్నా బిరుదును ప్రభుత్వం ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఇక, అన్నాడీఎంకేలోకి బన్రూటి చేరినట్టు ప్రచారం వేగం పుంజుకుంది. ఇందుకు తగ్గట్టుగానే బుధవారం బన్రూటి స్పందించడం గమనార్హం.
గెలుపునకు కృషి: తనకు అన్నా బిరుదు దక్కుతుందని కలలో కూడా ఊహించ లేదని బన్రూటి ఆనందం వ్యక్తం చేశారు. తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది అన్నా అని, ఆయన పేరిట ఉన్న ఈ బిరుదు తనకు ఇవ్వడం వెలకట్ట లేనిదిగా పేర్కొన్నారు. అన్నాతో కలసి అడుగులు వేసిన తనకు ఇంత పెద్ద బిరుదును ఇచ్చిన సీఎం జయలలిత రుణం తీర్చుకోలేనిదంటూ ప్రశంసలు కురిపించారు. అన్నా ఆశయ సాధనే లక్ష్యంగా, అన్నా అడుగు జాడల్లో నడుస్తున్న ఏకైక ప్రభుత్వం అన్నాడీఎంకేదేనని కితాబు ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల ద్వారా ఢిల్లీలో అన్నాడీఎంకే ఖ్యాతి ఎలుగెత్తి చాటడం లక్ష్యంగా పురట్చి తలైవి(విప్లవ నాయకురాలు)ఉన్నారని, ఈ లక్ష్య సాధనలో తాను భాగస్వామిని అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. బృహత్తర ఆశయంతో ముందుకెళుతున్న సీఎం జయలలిత కలనెరవేర్చడం కోసం ఆ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానని ప్రకటించారు. అనారోగ్య కారణాలు ఉన్నా, పూర్తి స్థాయిలో కాకుండా, కొన్ని చోట్లైనా తన సేవల్ని అందించేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించారు. దీన్ని బట్టి చూస్తే, త్వరలో అన్నాడీఎంకే తీర్థం బన్రూటి పుచ్చుకోవడం ఖాయం అనిపిస్తున్నది.
Advertisement