పన్నీర్ సెల్వం గ్రూప్‌పై త్వరలోనే వేటు!
- శశికళ ఎన్నిక నిబంధనలకు విరుద్ధం కాదు
చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా వీకే శశికళ ఎన్నిక పార్టీ నిబంధనలకు లోబడి జరిగిందని ఆ పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి పన్రుత్తి ఎస్ రామచంద్రన్ బుధవారం పేర్కొన్నారు. శశికళ ఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘించి శశికళను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారంటూ ఆ పార్టీ బహిష్కృత ఎంపీ శశికళ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఈసీ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే.
అదేవిధంగా శశికళకు ఎదురుతిరిగి.. మాజీ సీఎం పన్నీర్ సెల్వం గ్రూపులో చేరిన పదిమంది ఎమ్మెల్యేలపై సరైన సమయంలో వేటు వేస్తామని, పార్టీ విప్ ధిక్కరించిన వారిపై చర్య తప్పదని ఆయన పేర్కొన్నారు. పళనిస్వామికి వ్యతిరేకంగా డీఎంకే రాద్ధాంతం చేస్తున్నదని, అసెంబ్లీలో జరిగిన బలపరీక్ష చట్టబద్ధమైనదేనని అన్నారు.