
చెన్నై: స్టార్ హీరో విజయ్ కొత్త పార్టీ ప్రకటన తర్వాత.. తమిళనాడు రాజకీయాలపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు టైం ఉంది. ఈలోపే విజయ్ ‘‘తమిళగ వెట్రి కళగం’’ TVK ఎవరితో చేతులు కలుపుతుంది? ఏ మేర ప్రభావం చూపెడుతుందంటూ డిబేట్‌లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాజకీయ ప్రవేశంపై విజయ్ ప్రశాంత్ కిషోర్‌తో సైతం చర్చలు జరిపినట్లు వార్తలు వినవచ్చాయి. ఓ తమిళ ఛానెల్ ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్‌కు దీనికి సంబంధించి ప్రశ్న ఎదురైంది. విజయ్ అడిగితే ఆయన పార్టీ కోసం పని చేస్తారా? అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ‘‘విజయ్ నాతో టచ్‌లో లేరు. ప్రస్తుతం ఎన్నికల వ్యహకర్త వ్యవహారాలను నేను చూడడం లేదు. ఒకవేళ ఆయన నన్ను అడిగినా.. ఆ పని చేయలేను. కానీ, ఆయన కోరుకుంటే మాత్రం సలహాలు ఇచ్చి సాయం చేయగలను. ఎందుకంటే.. నన్ను గౌరవించే వాళ్లకు సలహాలు ఇవ్వడం నాకు అలవాటు’’ అని పీకే క్లారిటీ ఇచ్చారు.
ఇక.. ఇదే ఇంటర్వ్యూలో తమిళనాడు రాజకీయాలపై స్పందించిన పీకే.. అక్కడి రాజకీయాల్లో విజయ్ ప్రభావంపైనా మాట్లాడారు. విజయ్ రాజకీయ రంగ ప్రవేశాన్ని తేలికగా తీసుకోవద్దని ఇతర పార్టీలకు సూచించారు. ముఖ్యంగా ద్రవిడ పార్టీల ఓటు బ్యాంకు 60 నుంచి 65 శాతం తగ్గిపోయే అవకాశం ఉందని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment