తమిళనాడులో హీరో విజయ్ పార్టీ ప్రకటించాడు. 'తమిళగ వెట్రి కళగం'Tamizhaga Vetri Kazhagam పేరుతో ఆయన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. గత మూడేళ్లుగా ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతుండగా నేటితో దానికి ఫుల్ స్టాప్ పెట్టారు. తమిళగ వెట్రి కళగం పేరును రిజస్టర్ చేసినట్లు ప్రకటన రావడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. గత కొద్ది నెలలుగా ఆయన ఎక్కువగా ప్రజల్లోనే కనిపించడమే కాకుండా పలు సేవా కార్యక్రామాల్లో పాల్గొంటు ఉన్న విషయం తెలిసిందే.
పార్టీ ప్రకటన అయితే వచ్చేసింది కానీ అందుకు సంబంధించిన గుర్తును త్వరలో ప్రకటించనున్నారు. పార్టీ ఎజెండాను కూడా త్వరలో ప్రకటిస్తామాని విజయ్ నుంచి ఒక నోట్ వెలువడింది. తమిళనాడులో అవినీతి పాలన సాగుతోందని దానిని నిర్మూలించడమే తన ధ్యేయం అని విజయ్ అన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే ప్రధాన టార్గెట్ అని విజయ్ పేర్కొన్నారు.
హీరో విజయ్ తన రాజకీయ రంగప్రవేశం ఒకరోజుతో అనుకుని జరగలేదు. పక్కా ప్లాన్‌తోనే ఆయన అడుగులు వేశారు. పొలిటికల్ రంగంలోకి దిగిన తర్వాత తన లక్ష్యాన్ని ఎలా ఛేదించాలి అనే దృఢ సంకల్పంతోనే టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరో పక్క తన విజయ్ మక్కళ్ ఇయక్కుమ్ ద్వారా పలు సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరవయ్యారు. ఈ సంఘం ద్వారా ఇప్పటికే రాష్ట్రంలో చాలా చోట్ల అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆపై అనేక రక్తదాన శిబిరాలతో పాటు ఉచిత విద్య కేంద్రాలు, ఉచిత న్యాయ సలహా కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ ఏర్పాటు చేశారు.
గతేడాది తమిళనాడులోని 234 నియోజకవర్గాలకు చెందిన పదవ తరగతి, ప్లస్‌టూ పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులను ముగ్గురు చొప్పున తన కార్యాలయానికి రప్పించి వారికి ప్రశంసాపత్రాలతో పాటు కానుకలను అందించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విజయ్ వారితో ముఖ్యంగా నోటుకు ఓటు విధానం సరికాదని, దీన్ని అందరూ పాటించాలని హితవు పలికారు. నెలరోజుల క్రితం తమిళనాడులో తుపాను దెబ్బకు వేలాది మంది ప్రజలు రోడ్డున పడ్డారు. వారందరికి తనవంతుగా సాయం అందించి వారికి అండగా నిలిచాడు. ఇలా తన పొలిటికల్ ఎంట్రీ కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు దగ్గరయ్యాడు.
ప్రస్తుతం తమిళనాడులో సినిమా పరిశ్రమ నుంచి కమల్ హాసన్, ఖుష్బూ, నమిత వంటి వారు మాత్రమే రాజకీయాల్లో ఉన్నారు. విజయ్ రాకతో ఆయన పార్టీలోకి మరికొంత మంది చేరనున్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment