రెండోస్సారి!
* పదేళ్లలో మరో ఒంటరిపోరు
* డీఎండీకే నిర్ణయంపై అన్ని పార్టీల్లో విస్మయం
* ప్రజాస్వామ్య కూటమిపై చర్చ
చెన్నై, సాక్షి ప్రతినిధి : పార్టీ ఆవిర్భావంలో ఒకసారి ఒంటరిపోరుకు దిగిన డీఎండీకే సరిగ్గా పదేళ్ల తరువాత మరోసారి ఒంటరిగా ఎన్నికల సమరాన్ని ఎదుర్కోనుంది. తొలి సమరంలో కేవలం ఒక్కసీటు మాత్రమే దక్కగా రెండో సమరం ఫలితాలకు మరో నెలన్నర రోజులు ఆగాల్సి వచ్చింది. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలో డీఎంకే, అన్నాడీఎంకేల తరువాత తృతీయస్థానాన్ని దక్కించుకున్న డీఎండీకే సైతం కోలీవుడ్ నేపథ్యం నుంచి పుట్టుకొచ్చిందే.
డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై, ప్రస్తుత అధ్యక్షుడు కరుణానిధి, అన్నాడీఎంకే వ్యవస్థాపకులు ఎంజీ రామచంద్రన్, ప్రస్తుతం పార్టీ అధినేత్రి జయలలిత సినిమారంగానికి చెందినవారని ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ఆ రెండు పార్టీల అధినేతలు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అదే వరుసలో తాను సైతం సీఎం కావాలని ఆశించిన విజయకాంత్ 2005లో రాజకీయాల్లోకి దిగారు. తమిళనాడులో ద్రవిడ పార్టీలకే ప్రజల్లో ఆదరణ ఉండటంతో విజయకాంత్ అధ్యక్షుడుగా దేశీయ ముర్పోక్కు ద్రవిడ కళగం (డీఎండీకే) పేరుతో 2005లో పార్టీ ఆవిర్భవించింది.
ఆ మరుసటి ఏడాదే అంటే 2006లో అసెంబ్లీ ఎన్నికలు రాగా మొత్తం 234 స్థానాల్లో తమ అభ్యుర్థులను నిలబెట్టి ఒంటరిగా పోటీకి దిగారు. విరుదాచలం నియోజవర్గం నుంచి విజయకాంత్ పోటీచేశారు. అన్ని నియోజకవర్గాల్లో డీఎండీకే అభ్యర్థులు పరాజయం పాలుకాగా విజయకాంత్ ఒక్కరే గెలిచారు. అయితే అనేక నియోజకవర్గాల్లో గణనీయమైన సంఖ్యలో ఓట్లను సాధించడం ద్వారా రాజకీయాల్లో కలకలం రేపారు. డీఎంకే, అన్నాడీఎంకే వంటి సీనియర్ పార్టీలను ఒంటికాలిపై ఢీకొని ఆ ఏడాది 8 శాతం ఓట్లను సాధించడం ఒక రికార్డుగా నిలిచింది.
ఆ (2006) ఏడాది జరిగిన ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి వచ్చినా పూర్తిస్థాయి మెజారిటీ లేకుండా పోయింది. అలాగే 2009 పార్లమెంటు ఎన్నికల్లో డీఎండీకే ఒంటరిగానే పోటీచేసి మొత్తం 39 స్థానాల్లోనూ ఓడిపోయింది. అయితే అన్ని నియోజకవర్గాల్లో కనీస ఓట్లను సాధించడం ద్వారా ఓటు బ్యాంకును చాటిచెప్పింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకున్న డీఎం డీకే 41 స్థానాల్లో పోటీచే సి 29 స్థానాల్లో గెలుపొందింది. విజయకాంత్ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ను దక్కించుకున్నారు. అన్నాడీఎంకేతో ఆయన చెలిమి ఎక్కవకాలం కొనసాగలేదు. ఈ పరిస్థితుల్లో 2006 తరువాత ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి ఒంటరి పోరుకు సిద్ధమయ్యారు. పార్టీ ఆవిర్భావం తరువాత రెండుసార్లు ఒంటరిపోరుకు దిగినట్లయింది.
సతీమణి సలహాతోనే ఒంటరిపోరు
ఏదో ఒక బలమైన పార్టీతో పొత్తుపెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగాలని విజయకాంత్ భావించగా, ఆయన సతీమణి ప్రేమలత మొత్తం వ్యూహాన్నే మార్చివేసినట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకుని ఈ ఏడాది ఆ పార్టీకి బద్దశత్రువైన డీఎంకేతో జతకడితే ప్రజల్లోనూ, ఇతర పార్టీల్లోనూ చులకనై పోతామని ఆమె నూరిపోసినట్లు సమాచారం. ప్రేమలత మాటలను విశ్వసించిన విజయకాంత్ ‘పెళ్లాం చెబితే వినాలి’ అనే రీతిలో రాజకీయాలు నడిపిస్తున్నారని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
కేవలం విజయకాంత్ భార్యగాకాక చురుకైన నేతగా ప్రేమలత పేరొందడంతో ఆమె నిర్ణయాలకు విలువ పెరుగుతోంది. అందుకే గురువారం జరిగిన సభలో వ్యూహాత్మకంగా అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలపై ప్రేమలత దుమ్మెత్తిపోశారు. అయితే ఇన్నాళ్లు ఏదోఒక బలమైన పార్టీతో జతకట్టి కొన్ని సీట్లు దక్కించుకోగలమని నమ్మకంతో ఉన్న పార్టీనేతలు ఒంటరిపోరుతో నిరాశపడినట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు పార్టీ వైఖరి స్పష్టం కావడంతో శుక్రవారం అభ్యర్థుల ఎంపికను ప్రారంభించారు.
ప్రజాసంక్షేమ కూటమి కెప్టెన్‌తో కలిసేనా
రాష్ట్రంలో 8 నుంచి 10 శాతం మాత్రమే ఓటు బ్యాంకు కలిగి ఉన్న డీఎండీకే ఒంటరి పోరుకు దిగడం అన్ని పార్టీలను ఆశ్చర్యపరిచింది. కెప్టెన్ తమ కూటమిలోకి వస్తాడనే చర్చలు మారిపోయి ప్రస్తుతం కెప్టెన్ ఒక కొత్తకూటమిని ఏర్పాటు చేసుకుంటాడనే ప్రచారం సాగుతోంది. ప్రజా సంక్షేమ కూటమి విజయకాంత్‌తో చేతులు కలిపి అతడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రజా సంక్షేమ కూటమిలోని ఎండీఎంకే, వీసీకే, వామపక్షాలతో డీఎండీకే కూడా చేరితే బలమైన కూటమిగా ఏర్పడగలదని ఆశిస్తున్నారు. తద్వారా కూటమి బలం 15 శాతం నుంచి 18 శాతానికి పెరుగుతుందని అంచనావేస్తున్నారు. ఓటుబ్యాం కు లెక్కలు చెప్పి ఎలాగైనా కెప్టెన్‌ను తమతో కలుపుకోవాలని ప్రజాస్వామ్య కూటమి తహతహలాడుతోంది.