సీఎం అభ్యర్థిగా విజయకాంత్
ప్రజా సంక్షేమ కూటమిలో డీఎండీకే
చెన్నై, సాక్షి ప్రతినిధి: డీఎండీకే అధినేత విజయకాంత్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగ నున్నారు. ఎండీఎంకే అధినేత వైగో నేతృత్వంలో ఏర్పడిన ప్రజాసంక్షేమ కూటమి(పీడబ్ల్యుఎఫ్)తో పొత్తుపెట్టుకోవడం ద్వారా సీఎం అభ్యర్థిగా రంగంలో ఉండాలన్న కలను విజయకాంత్ నెరవేర్చుకున్నారు. పీడబ్ల్యుఎఫ్‌లో వైగో నేతృత్వం వహిస్తున్న ఎండీఎంకేతో పాటు, సీపీఐ, సీపీఎం, వీసీకేలు భాగస్వాములుగా ఉన్నాయి.
బుధవారం డీఎండీకే కార్యాలయంలో విజయకాంత్, సుధీష్, ఎండీఎంకే అధినేత వైగో, వీసీకే అధ్యక్షుడు తిరుమావలవన్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జీ.రామకృష్ణన్ తుది విడత చర్చలు జరిపారు. దీంతో కొన్ని రోజులుగా తమిళనాడులో పార్టీల మధ్య పొత్తుల ఊహాగానాలకు బుధవారం తెరపడింది. ఆపై సీఎం అభ్యర్థిగా విజయకాంత్ పేరును అధికారికంగా ప్రకటించారు. అలాగే డీఎండీకేకు 124సీట్లు, వైగో బృందానికి 110 సీట్లు కేటాయించేలా ఒప్పందం కుదిరింది. కాగా, డీఎండీకేతో పొత్తు ఆశించిన బీజేపీ ఈ కూటమి ఏర్పాటును విమర్శించింది.