పొత్తుపై నోరువిప్పని విజయకాంత్
కెప్టెన్ కోసం త్యాగాలకు సిద్ధమన్న కాంగ్రెస్
పొత్తు విషయమై ఏ నిర్ణయం తీసుకుంటారోనని రాజకీయ పార్టీల చూపులన్నీ డీఎండీకే చుట్టూ పరిభ్రమిస్తుండగా ఆ పార్టీ అధినేత విజయకాంత్ మాత్రం నర్మగర్భంగానే వ్యవహరిస్తున్నారు. కాంచీపురంలో శనివారం నిర్వహించిన పార్టీ మహానాడులో అన్నాడీఎంకేపై విమర్శనాస్త్రాలతోనే తన ప్రసంగాన్ని ముగించి నిరాశపరిచారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రాంతీయ పార్టీల వరుసలో మూడో ప్రాధాన్యతను దక్కించుకున్న డీఎండీకే పొత్తు విషయమై ముసుగులో గుద్దులాటలా వ్యవహరిస్తోంది. గత పార్లమెంటు ఎన్నికల్లో కమలనాథుల కూటమిలో చేరింది. అయితే తన పార్టీ అభ్యర్దుల ప్రచారంతో సరిపెట్టుకున్న విజయకాంత్ మిత్రపక్ష బీజేపీ అభ్యర్థుల గెలుపునకు పాటుపడలేదు. పార్లమెంటు ఎన్నికల తరువాత బీజేపీతో అంటీముట్టనట్లుగా వ్యవహరించిన విజయకాంత్ అసెంబ్లీ ఎన్నికల సమయానికి తాను పూర్తిగా దూరంగా జరిగారు. డీఎండీకేతో పొత్తుపెట్టుకోవాలని డీఎంకే గట్టి ప్రయత్నాలు చేస్తోంది.
ఇటీవలే పొత్తు ఖరారు చేసుకున్న కాంగ్రెస్‌కు విజయకాంత్‌ను చేరదీసే బాధ్యతను అప్పగించింది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్ సైతం డీఎండీకే గనుక తమ కూటమిలో కలిస్తే విజయకాంత్ పెట్టే అన్ని నిబంధనలకు ఓకే చెబుతామని ప్రకటించారు. అంతేకాదు, డీఎండీకే అభ్యర్థుల కోసం తమ సీట్లు తగ్గించుకునేందుకు సైతం సిద్దమని ఆఫర్ ఇచ్చారు. బీజేపీ సైతం డీఎండీకే నిర్ణయం కోసం ఎదురుచూస్తోంది. ప్రజాస్వామ్య కూటమి నేతలు వైగో, వామపక్షాలు విజయకాంత్‌ను ఆహ్వానిస్తూనే ఉన్నాయి. ఈ దశలో కాంచీపురంలో శనివారం పార్టీ మహానాడుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభ కావాల్సిన సభ 6.30 గంటలకు ప్రారంభమైంది. పార్టీ నేతలు యువజన విభాగం అధ్యక్షులు సుదేష్ తరువాత విజయకాంత్ సతీమణి ప్రేమలత ప్రసంగించారు.
కింగ్ మేకర్ కాదు కింగ్‌ను చేయండి: ప్రేమలత
రాబోయే ఎన్నికల్లో డీఎండీకే అధినేత విజయకాంత్‌ను కింగ్ చేస్తారా, కింగ్ మేకర్‌ను చేస్తారా, మీరు దేనిని కోరుకుంటున్నారని ప్రేమలతా విజయకాంత్ సభను ప్రశ్నించారు. అనేక సార్లు అదే ప్రశ్నను రెట్టించి చివరగా కింగ్ మేకర్ వద్దు కింగ్‌ను చేయాలని కోరారు.
అభిమానులే నిర్ణయిస్తారు:విజయకాంత్
కాంచీపురం మహానాడులో పొత్తు విషయమై ప్రకటిస్తానని ప్రతి ఒక్కరూ ఆశించారని విజయకాంత్ అన్నారు. అయితే పొత్తుపెట్టుకుంటే తాను కింగ్‌ను అవుతానా లేక కింగ్ మేకర్‌ను అవుతానా అని కార్యకర్తలను ఆయన ప్రశ్నించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తనను కింగ్‌ను చేయాలా లేక కింగ్ మేకర్‌ను చేయాలా అనేది కార్యకర్తలు, అభిమానులే త్వరలో నిర్ణయిస్తారని ఆయన పేర్కొంటూ ప్రసంగాన్ని ముగించారు. సమయం వచ్చినప్పుడు నిర్ణయం ప్రకటిస్తానన్నారు.