సాక్షి, చెన్నై: సినీ నటి కుష్బూకు కాంగ్రెస్‌లో ప్రమోషన్ కల్పించబోతున్నారు. ఆమెకు రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవి కట్టబెట్టేందుకు ఏఐసీసీ నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. సినీ నటి కుష్బూ వాక్ చాతుర్యం, రాజకీయ అడుగుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డీఎంకే నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన ఆమెకు పార్టీ అధికార ప్రతినిధి పదవి దక్కింది. అయితే, కాంగ్రెస్‌లోని గ్రూపు రాజకీయాలు తట్టుకోలేని పరిస్థితి. ఎన్నికల్లో పోటీకి పలుమార్లు ప్రయత్నించినా, సీటు దక్కలేదు. ఈ పరిస్థితుల్లో ఇటీవల రాష్ట్ర బీజేపీలో చేరుతున్న సినీ గ్లామర్‌కు ప్రత్యేక గుర్తింపు కల్పించే రీతిలో పదవుల్ని కట్టబెడుతున్నారు. అయితే, అలాంటి గుర్తింపులు కాంగ్రెస్‌లో కుష్బూకు కరువే అన్న ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో కుష్బూ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు పది రోజులుగా ఓ ప్రచారం సాగుతోంది. చదవండి: (తలైవి పాత్రలో ఒదిగిపోయిన కంగనా)
ఈ సమయంలో కుష్బూ ఢిల్లీ వెళ్లి రావడం ప్రాధాన్యతకు దారి తీసింది. అయితే, కుష్బూ సేవల్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకునేందుకు ఏఐసీసీ పెద్దలు నిర్ణయించినట్టు సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్‌లో అధ్యక్షుడు కేఎస్ అళగిరి తర్వాత కార్యనిర్వాహక అధ్యక్షులుగా విష్ణుప్రసాద్, మయూరా జయకుమార్, మెహనకుమార మంగళం, హెచ్ వసంతకుమార్‌లను ఏఐసీసీ నియమించింది. ఇందులో హెచ్ వసంతకుమార్ మరణించారు. ప్రస్తుతం ఈ పదవీ ఖాళీగా ఉంది. ఈ పదవిని కుష్బూకు ఏఐసీసీ నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఒకటి రెండు రోజుల్లో ఇందుకు తగ్గ అధికార ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్టు కాంగ్రెస్‌లో చర్చ సాగుతోంది.
మేనిఫెస్టో కమిటీ
సాక్షి, చెన్నై: 2021 ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనపై డీఎంకే దృష్టి పెట్టింది. ఇందుకోసం ఎనిమిది మందితో కమిటీని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ ఆదివారం ప్రకటించారు. మరో ఆరు నెలల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనున్న విషయం తెలిసిందే. ఇప్పటినుంచి రాజకీయ పక్షాలు వ్యూహాలకు పదునుపెట్టాయి. ఇందులో డీఎంకే కాస్త దూకుడుగా ముందుకు సాగుతోంది. ఈ సారి అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో డీఎంకే శ్రేణులు వేగాన్ని పెంచారు. ప్రజల్ని ఆకర్షించే దిశగా ఆ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ పరుగులు తీస్తున్నారు. ఇప్పటివరకు వెలువడ్డ సర్వేలన్నీ డీఎంకేకు అనుకూలంగా ఉండడంతో, ఇది చేజారకుండా మరింత బలాన్ని పెంపొందించుకోవడం లక్ష్యం వ్యూహాలకు మరింత పదును పెట్టే పనిలో స్టాలిన్ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనపై దృష్టిపెట్టారు.
ఇందుకోసం ప్రత్యేకంగా ఓ కమిటీని ప్రకటించారు. స్టాలిన్ ఆదేశాలతో ఎన్నికల మేని ఫెస్టో కమిటీని ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ ప్రకటించారు. ఇందులో పార్టీ కోశాధికారి టీఆర్ బాలు, ఎంపీలు కనిమొళి, రాజా, తిరుచ్చిశివ, టీకేఎస్ ఇళంగోవన్, అందియూరు సెల్వరాజ్, పార్టీ సీనియర్ సుబ్బలక్ష్మి జగదీశన్, ప్రొఫెసర్ రామస్వామి ఉన్నారు. ఇప్పటికే ఆయా జిల్లాల నుంచి సమస్యలు, చేపట్టాల్సిన పనులకు తగ్గ నివేదికలు రాష్ట్ర కార్యాలయానికి చేరాయి.
వీటన్నింటిని పరిశీలించి, రాష్ట్రవ్యాప్తంగా పర్యటన తర్వాత మేనిఫెస్టోను సిద్ధం చేసి అధ్యక్షుడికి ఈ కమిటీ సమర్పించనుంది. అలాగే, సీట్ల పంపకాలకు సంబంధించి ఓ కమిటీని రంగంలోకి దించేందుకు డీఎంకే సిద్ధమవుతోంది. ఈ సారి ఎన్నికల్లో కనీసం 180 స్థానాల్లో పోటీ చేయాలన్న లక్ష్యంతో డీఎంకే ఉండడంతో మిత్రులకు సింగిల్ డిజిట్ సీట్లే దక్కబోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment