అమ్మకు ఓటమి భయం
♦ కెప్టెన్ ఎద్దేవా
♦ ఆ ఇద్దరినీ నమ్మొద్దు
♦ ఓటర్లకు సూచన
అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు ఓటమి భయం పట్టుకున్నదని డీఎండీకే అధినేత, ప్రజాసంక్షేమ కూటమి సీఎం అభ్యర్థి కెప్టెన్ ఎద్దేవా చేశారు. డీఎంకే, అన్నాడీఎంకే మేనిఫెస్టోల్లోని వాగ్దానాలను నమ్మవద్దని సూచించారు.
సాక్షి, చెన్నై: ప్రజా సంక్షేమ కూటమి అభ్యర్థులకు మద్దతుగా విజయకాంత్ సుడిగాలి పర్యటన సాగిస్తూ వస్తున్నారు. అధికార పగ్గాలు లక్ష్యంగా సాగుతున్న తన పర్యటనలో డీఎంకే, అన్నాడీఎంకేలను గురి పెట్టి విజయకాంత్ తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. శనివారం విల్లుపురం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు. ఓటర్లను ఆకర్షించేందుకు తన దైన శైలిలో దూసుకెళ్లారు. విల్లుపురంలో జరిగిన ప్రచార బహిరంగ సభలో విజయకాంత్ ప్రసంగిస్తూ, అమ్మకు ఓటమిభయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. అందుకే ఆల్‌ఫ్రీ అన్నట్టుగా వాగ్దానాలు ఇచ్చేస్తున్నారని విమర్శించారు.
ఆమె ఇచ్చిన వాగ్దానాల్లో ఉన్న ఆల్‌ఫ్రీ అన్నీ జనం చేతుల్లో ఉన్నవేనని వ్యాఖ్యానించారు. కొత్తగా ఆమె ఇచ్చేదేమిటంటూ మండి పడ్డారు. ఆమె వాగ్దానాల్ని నమ్మ వద్దు అని , ఈ సారి ఆమె గానీ అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు రెట్టింపు అవుతాయని, మద్యం దుకాణాలు మూడింతలు పెరుగుతాయని, బస్సు చార్జీలు నాలుగింతలు పెరుగుతాయని వివరించారు. ఓటమి భయం అమ్మలో పెరిగిందని, అందుకే ఉచితాల పేరిట మభ్య పెట్టే యత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అమ్మ ఉప్పు, అమ్మ పప్పు, అమ్మ ...అమ్మ అని అంతా ఆమె భజనే చేస్తున్నారు గానీ, పురట్చి తలైవర్(విప్లవనాయకుడు) ఎంజీయార్ పేరును ఏ ఒక్క పథకానికి ఎందుకు పెట్టలేదో ప్రజలు నిలదీయాలని పిలుపు నిచ్చారు.
ఎన్నికలప్పుడే ఆమెకు పురట్చి తలైవర్ ఎంజియార్ గుర్తుకు వస్తారని, అధికారంలోకి వస్తే, ఎంజీయార్‌ను పక్కన పడేసి, అంతా తానే అమ్మ భజన చేయడంటూ హెచ్చరించడం, మాట వినకుంటే, పదవుల్ని ఊడగొట్టడం ఆమెకు పరిపాటేనని ఎద్దేవా చేశారు. ఇక, ఆమెనే కాదు, డీఎంకేను ఎట్టి పరిస్థితుల్లో నమ్మ వద్దని సూచించారు. ఆ ఇద్దరూ పెద్ద అవినీతి పరులేనని, అధికారం కోసం మాయాజాలం చేస్తారని, తదుపరి చుక్కలు చూపిస్తారన్న విషయాన్ని పరిగణించాలన్నారు.
తాము ఆరుగురం రేయింబవళ్లు ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ ముందుకు సాగుతున్నామని, ఈ ఆరుగురి బలం ఏమిటో ఈ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు తెలుస్తాయని హెచ్చరించారు. దయ చేసి ఆ రెండు పార్టీలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మ వద్దు అని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా, ప్రతి ఇంటా వెలుగు నింపాలన్న ఒక్క తమ కూటమి ద్వారానే సాధ్యం అని, తమ అభ్యర్థులందరిని గెలిపించాలని విన్నవించారు.