డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్, డీఎండీకే అధినేత విజయకాంత్ వేర్వేరుగా మెట్రో రైలులో బుధవారం పయనించారు. ప్రయాణికులతో ముచ్చటించారు. ఈ రైలు సేవల్ని తిరువొత్తియూరు, తిరువేర్కాడు వరకు విస్తరించాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు డీఎంకే తీసుకొచ్చిందన్న ఒకే కారణంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపారంటూ సీఎం జయలలిత తీరుపై విజయకాంత్ మండిపడ్డారు.
సాక్షి, చెన్నై:నగరంలో మెట్రో రైలు సేవలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కోయంబేడు - ఆలందూరు మధ్య పరుగులు తీస్తున్న మెట్రో రైలులో పయనించేందుకు నగర వాసులు ఎగబడుతున్నారు. రైలు చార్జీ ఎక్కువగా ఉన్నప్పటికీ, తొలి అనుభూతిని ఆశ్వాదించే రీతిలో మెట్రో పయనానికి పరుగులు తీస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బుధవారం డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్, డీఎండీకే అధినేత విజయకాంత్ వేర్వేరుగా మెట్రో రైలు ఎక్కారు. ప్రయాణికులతో ముచ్చటిస్తూ తమ పయనం సాగించారు. స్టాలిన్ పయనం : సరిగ్గా 9.30 గంటలకు కోయంబేడులోని రైల్వే స్టేషన్‌కు డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ చేరుకున్నారు. ఆయన రాకతో ఆ పరిసరాల్లోని డీఎంకే వర్గాలు తరలివచ్చి ఆహ్వానం పలికాయి.
స్టాలిన్‌తో కలిసి నేతలు ఎం సుబ్రమణియన్,రాజేంద్రన్, ధన శేఖరన్ మెట్ల మార్గం గుండా వెళ్లి 9.45 గంటలకు మెట్రో రైలు ఎక్కారు. తమ బోగీలోకి స్టాలిన్ రావడంతో అందులో ఉన్న ప్రయాణికులు ఆయనతో కరచాలనంకు ఎగబడ్డారు. కాసేపు నిలబడి పయనించిన స్టాలిన్, మరికాసేపు సీట్లో కూర్చున్నారు. ప్రయాణికులతో ముచ్చటిస్తూ, రైలు సేవలు, అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. సరిగ్గా పది నిమిషాల్లో 9.55కు రైలు ఆలందూరు స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ డీఎంకే వర్గాలు స్టాలిన్‌కు ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా మీడియాతో స్టాలిన్ మాట్లాడుతూ, ఈ మెట్రో రైలు ప్రాజెక్టు తమ ఘనతేనని ధీమా వ్యక్తం చేశారు.
ఎక్కడ ఇతర పథకాల వలే ఈ ప్రాజెక్టును తుంగలో తొక్కేస్తారోనని భావించామని, అయితే, తాము ముందుగా తీసుకున్న చర్యలు, నిధుల కేటాయింపులతో ప్రాజెక్టును అడ్డుకోలేని పరిస్థితి ఈ పాలకులకు ఏర్పడిందని మండి పడ్డారు. అయితే, చార్జీ అధికంగా ఉందని, దీనిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టును తిరువొత్తియూరు, తిరువేర్కాడు వరకు పొడిగించాలని, రాష్ట్రంలోని ఇతర నగరాల్లోనూ మెట్రో సేవలు దరి చేర్చాలని డిమాండ్ చేశారు. తమ హయాంలో నిర్లవణీకరణ, మెట్రో ప్రాజెక్టు, రహదారులు, భారీ వంతెనలు తదితర అనేకానేక పథకాలు తీసుకొచ్చి దిగ్విజయవంతంగా అమలు చేశామని, అయితే, నాలుగున్నరేళ్ల అన్నాడీఎంకే హయాంలో ఇంత వరకు కొత్తగా ఏ ఒక్క పథకం పూర్తికాక పోవడం శోచనీయమని విమర్శించారు. ఇక, ఫేస్‌బుక్‌లతో తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని , దీనిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఈసందర్భంగా హెచ్చరించారు.
డీఎంకే పథకం కాబట్టే : మెట్రో రైలు ప్రాజెక్టు డీఎంకే తీసుకొచ్చింది కాబట్టే సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపేశారంటూ సీఎం జయలలిత తీరుపై డీడీకే అధినేత విజయకాంత్ మండి పడ్డారు. స్టాలిన్ పయనం ముగియగానే, సరిగ్గా 11 గంటలకు తన పార్టీ యువజన నేత సుదీష్, ఎమ్మెల్యేలు చంద్రకుమార్, పార్థసారథి, కామరాజ్‌లతో కలసి ఆలందూరు స్టేషన్‌కు విజయకాంత్ చేరుకున్నారు. ఎస్కలే టర్ ద్వారా పై అంతస్తుకు చేరుకున్న విజయకాంత్ రైలు కోసం పది నిమిషాలు వేచి ఉండాల్సి వచ్చింది. విజయకాంత్ రాకతో ఆయన్ను చూడటానికి ప్రయాణీకులు ఎగబడ్డారు.
అక్కడి సీట్లలో ప్రయాణికులతో కలసి కూర్చున్న విజయకాంత్ వారితో ముచ్చటిస్తూ, స్టేషన్లలోని ఏర్పాట్లు, పయన సౌకర్యం గురించి అడిగి తెలుసుకున్నారు. రైలు రాగా, ఓ వృద్ధురాలితో కలసి లోనికి వెళ్లిన విజయకాంత్ అక్కడ కూర్చుని ప్రయాణికులతో ముచ్చటిస్తూ, ఫోన్లో మాట్లాడుతూ ముందుకు సాగారు. కోయంబేడుకు చేరుకున్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు జెండా ఊపి ఉంటే బాగుండేదన్నారు. ఆయన వస్తే, ఎక్కడ తమ ఘనత చెప్పుకోలేని పరిస్థితి వస్తుందోనని భావించే సచివాలయం నుంచి అత్యవసరంగా జెండా ఊపేశారని విమర్శించారు. డిఎంకే ప్రభుత్వం తీసుకొచ్చిన మంచి పథకం ఇది అని, ఈ ఘనత వారిదేనంటూ, మంచి చేశారు కాబట్టే అభినందిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఆర్కే నగర్‌లో మధ్యాహ్నం వరకు యాభై శాతం ఓట్లే పోలైందని, ఆతర్వాత పోలైన ఓట్లన్నీ దొంగ ఓట్లేనని, దొంగ ఓట్లు, ఎన్నికల యంత్రాంగం సహాకారంతో మెజారిటీ తెచ్చుకున్నారంటూ ఆరోపించారు.
మెట్రోలో నేతలు
Published Thu, Jul 2 2015 3:07 AM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM
Advertisement