ఎంపీ సీట్లకు దరఖాస్తులు అమ్మబడును!
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో లోకసభ సభ్యుడిగా పోటీ చేయాలనుకునే వారికి శుభవార్త. తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల్లో లోకసభ ఎన్నికల్లో పోటీ పడాలనుకునే అభ్యర్థుల కోసం విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే పార్టీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తికల అభ్యర్థులు కోసం పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద జనవరి 23 తేదిన దరఖాస్తు ఫారాలను అమ్ముతారని తమిళనాడు ప్రతిపక్ష నేత విజయకాంత్ ఓ ప్రకటనలో తెలిపారు. తమిళనాడులో 39, పాండిచ్చేరిలో ఒక్క స్థానం కోసం (మొత్తం 40 స్థానాలకు) ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను ఫిబ్రవరి 1 తేదిలోపు దాఖలు చేయాలని ఆయన కోరారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పార్టీలో క్రియాశీలక కార్యకర్తలు, కార్యనిర్వాహాక సభ్యులై ఉండాలని తెలిపారు. జనరల్ కేటగిరి అభ్యర్థులకు దరఖాస్తు ఫారం ధర 20,000 కాగా, రిజర్వుడు స్థానాల అభ్యర్థుల కోసం 10,000 రూపాయలు అని తెలిపారు. అంతేకాకుండా రానున్న ఎన్నికల్లో పార్టీ ఘనవిజయానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో డిఎండీకే పార్టీతో డీఎంకే, బీజేపీలు పొత్తుకు సానుకూలంగా ఉండటంతో అభ్యర్థులు ఎంపికపై విజయకాంత్ కసరత్తు చేపట్టారు. అందులో భాగంగానే పార్టీ కార్యకర్తల నుంచి దరఖాస్తులు కోరినట్టు సమాచారం. ఫిబ్రవరి 2న విల్లుపురం జిల్లా ఉలుండర్ పేట్ లో జరిగే పార్టీ సమావేశంలో అభ్యర్తుల జాబితాను ప్రకటించడానికి విజయ్ కాంత్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది.