సాక్షి, చైన్నె : కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కేంద్రం చేతిలో ఉందని లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. తన వద్దకు నివేదిక రాగానే, పరిశీలించిన సంతకం పెట్టినట్టు వివరించారు. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పించాలన్న డిమాండ్ మార్మోగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల అసెంబ్లీలో బీజేపీ మిత్రపక్షం ఎన్‌ఆర్ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్ర హోదాకోసం తీర్మానం చేసింది. దీనిని రాజ్‌నివాస్‌కు పంపించారు. అయితే, దీనిని ఎల్జీ తమిళిసై సౌందరరాజన్ తుంగలో తొక్కేశారన్న ఆరోపణలు వచ్చాయి.
ఇందుకు సమాధానం ఇస్తూ ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పించాలని కోరుతూ మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వం తీర్మానం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ తీర్మాన నివేదిక తనకు జూలై 22న అందినట్టు పేర్కొన్నారు. మరుసటిరోజే తాను పరిశీలించి సంతకం కూడా చేశానని, అదే రోజున కేంద్రం అనుమతి కోరుతూ ఢిల్లీకి పంపించినట్టు వివరించారు.
నిబంధనల పరంగా ఇందులోని అంశాలను కేంద్ర ప్రభుత్వం, హోంశాఖ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. తన వరకు రాష్ట్ర హోదా ఫైల్‌లో సంతకం పెట్టానని, అమల్లోకి రావాలంటే కేంద్ర హోంశాఖ నుంచి ఆదేశాలు వెలువడాల్సి ఉంటుందన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment