అమిత్‌ షా మందలించారా?.. స్పందించిన తమిళిసై | Tamilisai Reacts On Amit Shah Serious Discussion With Her In Chandrababu Naidu Oath Ceremony, Tweet Goes Viral | Sakshi
Sakshi News home page

అమిత్‌ షా మందలించారా?.. స్పందించిన తమిళిసై

Published Fri, Jun 14 2024 7:07 AM | Last Updated on Fri, Jun 14 2024 9:32 AM

Tamilisai Reacts On Amit Shah Serious Discussion Video

చెన్నై: ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, తమిళనాడు బీజేపీ నేత  తమిళిసై సౌందరరాజన్‌ మధ్య సీరియస్‌గా సాగిన సంభాషణ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై అంతటా తీవ్ర చర్చకు దారితీసింది. ఇద్దరు నేతలు ఏం మాట్లాడుకున్నారు? ఆ సమయంలో ఇంత సీరియస్‌ చర్చేంటి? అంటూ రకరకాల ఊహాగానాలు తెర మీదకు వచ్చాయి. 

చంద్రబాబు  ప్రమాణ స్వీకారాని ముందు ఆహ్వానితుల జాబితాలో ఉన్న తమిళిసై అందరికీ అభివాదం చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఆ టైంలో వేదిక మీద ఉన్న బీజేపీ అగ్రనేతలకూ ఆమె నమస్కరించుకుంటూ పోసాగారు. అయితే ఆమెను వెనక్కి పిలిచిన అమిత్‌ షా.. ఏదో సీరియస్‌గా మాట్లాడారు. ఆమె వివరణ ఇవ్వబోతుండగా.. వేలు చూపించి మరీ ఏదో సీరియస్‌గానే చెప్పారు. దీంతో తమిళిసైకి అమిత్‌ షా వార్నింగ్‌ ఇచ్చారనే అంతా భావించారు. అయితే..  

VIDEO CREDITS: 𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨
ఈ ఘటనకు సంబంధించి తమిళిసై తాజాగా స్పందించారు. అమిత్‌ షాతో చర్చకు సంబంధించిన ఊహాగానాలను ఆమె కొట్టిపారేశారు. ఈ వీడియోను తప్పుగా అర్థం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు చేశారు. 

 ‘‘లోక్‌సభ ఎన్నికలు ముగిసిన అనంతరం ఏపీలో జరిగిన కార్యక్రమంలో తొలిసారిగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిశాను. పోలింగ్‌ తర్వాత సమీకరణాలు, ఎన్నికల్లో నేను ఎదుర్కొన్న సవాళ్ల గురించి తెలుసుకునేందుకు అమిత్‌ షా నన్ను పిలిచారు. నేను ఆయనకు వివరిస్తున్నప్పుడు సమయాభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన మాట్లాడారు. రాజకీయ, నియోజకవర్గ కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలని సలహా ఇచ్చారు. ఆ మాటలు నాకు ఎంతో భరోసా కలిగించాయి. ఈ అంశం చుట్టూ తిరుగుతున్న అన్ని ఊహాగానాలకు ఇది స్పష్టత ఇస్తుంది’’ అని తమిళిసై పేర్కొన్నారు. 

తమిళనాడులో బీజేపీ నేతల మధ్య అంతర్గత విభేదాల గురించే వీరి చర్చ సాగినట్లు కొందరు సోషల్‌మీడియాలో కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయం, ఎన్నికల కోసం అన్నాడీఎంకే పొత్తును ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్‌ అన్నామలై వ్యతిరేకించారని.. ఒకవేళ పొత్తుగా వెళ్లి ఉంటే బీజేపీ కచ్చితంగా విజయం సాధించి ఉండేదన్న అభిప్రాయం తమిళిసై వ్యక్తం చేశారని.. ఈ నేపథ్యంలో అమిత్‌షా ఆమెను పిలిచి మందలించారంటూ కొందరు అభిప్రాయపడ్డారు. మరోవైపు తమిళనాడు అధికార పార్టీ డీఎంకే ఈ పరిణామంపై స్పందించింది. ఓ మహిళా నేతతో ఇలాగేనా వ్యవహరించేది.. ఇదేనా బీజేపీ సంస్కృతి అంటూ మండిపడింది. ఇంకోవైపు.. అమిత్‌ షా అంత కఠువుగా వ్యవహరించి ఉండాల్సింది కాదు అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. అయితే ఆయన తననేం తిట్టలేదన్నట్లుగా ఇప్పుడు తమిళిసై వివరణ ఇచ్చుకొచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement