రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోపు మూడు పార్టీలను తన వైపునకు తిప్పుకోవాలన్న లక్ష్యం తో డీఎంకే అధినేత ఎం కరుణానిధి వ్యూహరచనల్లో పడ్డారు. వారికి గాలం వేయడం కోసం రంగంలోకి దిగేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే, డీఎండీకే నేత విజయకాంత్ మెట్టు దిగేనా..? అన్న ప్రశ్నను డీఎంకే వర్గాలే లేవదీస్తుండడం గమనార్హం.
సాక్షి, చెన్నై : వరుస పరాజయాలతో ఢీలా పడ్డ డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఎట్టకేలకు బలోపేతం లక్ష్యంగా పార్టీని జిల్లాల వారిగా పునర్విభజించక తప్పలేదు. జిల్లాల వారిగా పదవుల్లో కొత్త వాళ్లకు చోటు కల్పించారు. రానున్న ఎన్నికల్లో అధికార పగ్గాలు చేపట్టి తీరాలన్న కాంక్షతో ఉన్న కరుణానిధికి, తాజా పరిణామాలు పెద్ద షాకే అని చెప్పవచ్చు. నిర్దోషిగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత బయట పడడం, సీఎంగా పగ్గాలు చేపట్టడంతో తదుపరి కార్యచరణ మీద కరుణానిధి దృష్టి పెట్టి ఉన్నారు. జయలలిత హవాకు కల్లెం వేయడం లక్ష్యంగా ప్రతి పక్షాల్ని ఏకం చేసిన మెగా కూటమికి వ్యూహ రచనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా గతంలో ఎన్నడూ లేని రీతిలో తాజాగా తమ కుటుంబ వేడుకకు అన్ని పార్టీలను ఆహ్వానించే పనిలో పడ్డారు. అయితే, వీరిలో అందరూ కలసి వచ్చే అవకాశాలు లేని దృష్ట్యా, ప్రధానంగా మూడు పార్టీల మీద కన్నేసి ఉన్నారు.
ఆ మూడు పార్టీలే కీలకం
రాష్ట్రంలో ప్రధాన ప్రతి పక్షంగా ఉన్న డీఎండీకేకు వ్యక్తిగత ఓటు బ్యాంక్ బాగానే ఉన్నది. ఇక, కాంగ్రెస్‌కు కాస్తో కూస్తో ఓటు బ్యాంక్ ఉంది. అలాగే, వైగో నేతృత్వంలోని ఎండీఎంకేకు దక్షిణ తమిళనాడులో కొంత మేరకు బలం ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే తమ వెంట పుదియ తమిళగం, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్‌లు ఉండడంతో, మిగిలిన ఆ మూడు పార్టీలను తమ వైపునకు తిప్పుకోవాలన్న లక్ష్యంతో వ్యూహ రచనల్లో నిమగ్నం అయ్యారు. తమ కుటుంబ వేడుకకు హాజరయ్యే ఆ మూడు పార్టీ నాయకులతో సన్నిహితంగా మెలిగేందుకు సిద్ధం అవుతున్నారు. ఇందుకు తగ్గ కార్యచరణ సిద్ధం చేసి ఉన్నట్టుగా డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. వాసన్ నేతృత్వంలోని టీఎంసీ తమతో చేతులు కలిపే అవకాశాలు లేని దృష్ట్యా, రాందాసు నేతృత్వంలోని పీఎంకేను నమ్మలేని పరిస్థితి ఉన్నందున,ఆ ఇద్దర్ని పక్కన పెట్టేందుకు డీఎంకే సిద్ధం అయినట్టు సంకేతాలు ఉన్నాయి.
ఇక, వామపక్షాల దారి ఎటో అన్నట్టుగా ఉండడంతో, కలిసి వస్తే వారిని అక్కున చేర్చుకునేందుకు సైతం వ్యూహ రచన చేసి ఉండడం గమనించాల్సిన విషయం. డీఎంకేతో కలిసి నడిచేందుకు ఎండిఎంకే సిద్ధంగానే ఉన్నట్టుగా ప్రచారం సాగుతున్నది. ఆ పార్టీ నుంచి డిఎంకే గూటికి చేరి అధికార ప్రతినిధిగా చెలామణిలో ఉన్న కేఎస్ రాధాకృష్ణన్ అందుకు తగ్గ ప్రయత్నాల్లో నిమగ్నమైనట్టు సమాచారం. కేఎస్ రాధాకృష్ణన్ ద్వారా డీఎంకే అధిష్టానం నుంచి కొన్ని హామీలను తీసుకున్న తర్వాతే వైగో తన స్పష్టతను వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నట్టుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక, డీఎంకేతో కలసి నడిచేందుకు తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ సిద్ధంగా ఉన్నా, తమ అధిష్టానం నిర్ణయం కోసం వేచి చూడక తప్పలేదు. ఇక, చిక్కంతా డీఎంకే అధినేత విజయకాంత్ రూపంలో డీఎంకేకు ఎదురయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. అదే సమయంలో ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని పార్టీలకు వల వేయడం లక్ష్యంగా, ఆయా పార్టీ వర్గాలతో వ్యవహరించాల్సిన తీరు, తదితర అంశాలతో పాటుగా ప్రజల్లోకి వెళ్లడం కోసం అస్త్రాలు సిద్ధం చేయడానికి సోమవారం జిల్లాల కార్యదర్శుల సమావేశానికి సైతం కరుణానిధి పిలుపు నిచ్చినట్టుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
విజయకాంత్ తగ్గేనా
విజయకాంత్‌కు రాష్ట్రంలో బలం ఉన్నా, తన నోటి దురుసు తనం, దూకుడుతో కమెడియన్‌గా మారుతున్నారు. ప్రస్తుతానికి బీజేపీ జపం చేస్తున్న విజయకాంత్‌కు ఎన్నికల సమయంలో షాక్‌లు తగిలే అవకాశాలు ఎక్కవే. అన్నాడీఎంకేతో బీజేపీ దోస్తి కట్టిన పక్షంలో ప్రత్యామ్నాయం మీద ఆయన దృష్టి పెట్టక తప్పదు. ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు సిద్ధం అయ్యేందుకు వెనుకాడని విజయకాంత్, డీఎంకేతో దోస్తి విషయంగా ఏ మేరకు మెట్టు దిగుతారోనన్నది వేచి చూడాల్సి ఉంది. ఆహ్వాన పత్రికను ఇవ్వడానికి విరుగ్గం బాక్కంలోని విజయకాంత్ ఇంటికి వెళ్లేందుకు తొలుత డీఎంకే కోశాధికారి స్టాలిన్ నిర్ణయించినట్టు సమాచారం. అయితే, ఇంటికి రావొద్దని, పార్టీ కార్యాలయానికి రావాలని ఆయన సూచించి ఉన్నారు. స్టాలిన్ వచ్చి వెళ్లగానే, తన కార్యాలయాన్ని కూల్చి వేసిన వాళ్లను, అదే చోట మెట్లు ఎక్కేలా చేశానంటూ తన వాళ్లతో విజయకాంత్ వ్యంగ్యంగా మాట్లాడినట్టు సంకేతాలు వెలువడడం గమనార్హం.
ఆ పార్టీలే లక్ష్యం
Published Mon, May 25 2015 2:39 AM | Last Updated on Sun, Sep 3 2017 2:37 AM
Advertisement