సీఎం కరుణేనని మక్కల్ ఆయువగం సర్వే
గెలుపునకు మరింతగా శ్రమించండి
కార్యకర్తలకు కరుణ లేఖ సొంత గడ్డలో ప్రచారం
తమిళనాడు తదుపరి సీఎం డీఎంకే అధినేత ఎం కరుణానిధి అని మక్కల్ ఆయువగం స్పష్టం చేసింది. లయోలా కళాశాల విద్యార్థులతో కూడిన ఈ బృందం గతంలోనూ ఎన్నికలకు ముందుగా జరిపిన సర్వేలు కొంత మేరకు సఫలీకృతం కావడం గమనార్హం. డీఎంకే 118-120 సీట్లను కైవశం చేసుకుంటుందని, తదుపరి స్థానంలో అన్నాడీఎంకే 98 సీట్ల వరకు దక్కించుకుంటుదని తమ సర్వే వివరాల్ని శుక్రవారం ఆ సంస్థ నిర్వాహకుడు రాజనాయగం ప్రకటించారు.
చెన్నై : రాష్ర్టంలో ప్రజా నాడి ఈ సారి అంతు చిక్కడం లేదు. దీంతో సర్వేల గోల తారా స్థాయికి చేరి ఉన్నది. ఇప్పటికే పలు సంస్థలు సంఘాలు సర్వేలు జరిపి ఉన్నాయి. ఇందులో కొందరు డీఎంకే, అంటే మరి కొందరు అన్నాడీఎంకేకు జై కొట్టి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రతి ఏటా ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు, ఎన్నికలకు ముందుగా లయోల విద్యార్థులతో కూడిన మక్కల్ ఆయువగం సంస్థ రాష్ట్రంలో సర్వేలు చేపట్టడం జరుగుతూ వస్తున్నది.
చెన్నైకు చెందిన ఈసంస్థ అభ్యర్థుల జాబితా విడుదల, నామినేషన్ల పర్వం ముగియడం, ప్రచారం తారా స్థాయికి చేరి, చివరి క్షణాలకు చేరడం వరకు పరిగణలోకి తీసుకుని రాష్ట్రంలో సర్వే సాగించి ఉన్నది. ఇందుకు తగ్గ వివరాల్ని శుక్రవారం చెన్నై ప్రెస్‌క్లబ్‌లో ఆ సంస్థ నిర్వాహకుడు రాజనాయగం ప్రకటించారు. రాష్ట్రంలో ప్రజా నాడి డిఎంకే వైపుగానే ఉందని వివరించారు. ఆ పార్టీకి 118-120 సీట్లు రావడం ఖాయం అని వ్యాఖ్యానించారు.
ఆ కూటమిలోని కాంగ్రెస్‌కు ఎనిమిది లేదా పది సీట్లు దక్కే అవకాశం ఉందన్నారు. ఇక, అన్నాడీఎంకేకు 98లోపు సీట్లు, డీఎండీకే ప్రజా సంక్షేమ కూటమికి ఎనిమిది లోపు దక్కే అవకాశాలు ఉన్నాయని వివరించారు. డిఎంకేకు 42. 7 శాతం, అన్నాడీఎంకేకు 36.6 శాతం మంది మద్దతు ఇచ్చి ఉన్నారని, ఈ దృష్ట్యా, తదుపరి సీఎం పగ్గాలు కరుణానిధి చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు పేర్కొన్నారు. గతంలో ఇదే సంస్థ పలు సర్వేలు సాగించింది. ఇందులో అనేకం దరిదాపుల్లో సఫలీకృతం అయినా, చివరి క్షణంలో ఓటరు నాడి ఎలా ఉంటుందో చెప్పలేం...
గెలుపు కోసం శ్రమిద్దాం: అన్నాడీఎంకేలో ఓటమి భయం పెరిగిందని, అందుకే ఓటుకు నోట్ల కట్టల్ని చల్లుతున్నారంటూ డిఎంకే అధినేత కరుణానిధి వ్యాఖ్యానించారు. ఆ నోట్ల గురించి ఆలోచించ వద్దని, ఓట్లు ఎలా రాబట్టాలో అన్న విషయంగా ప్రతి కార్యకర్త శ్రమించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం కార్యకర్తలకు, పార్టీ వర్గాలకు కరుణానిధి లేఖ రాశారు. డిఎంకేకు అనుకూలంగా వాతావరణం మారి ఉండడంతో దాడులకు, జులుంలకు అన్నాడీఎంకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.
ఓటమి తప్పదన్న భయంతో నోట్ల కట్టల్ని చల్లుతున్నారన్న విషయం గురించి పట్టించుకోవద్దని, ఓటర్లను ఆకర్షించి ఎలా డీఎంకేకు అనుకూలంగా మలచుకోవాలో అన్న నినాదంతో ప్రతి కార్యకర్త ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాలని విన్నవించారు. ఇక, తన సొంత గడ్డ, తాను పోటీలో ఉన్న తిరువారూర్ నియోజకవర్గంలో ఉదయం నుంచి రాత్రి వరకు కరుణానిధి తీవ్ర ప్రచారం చేశారు.
రోడ్‌షో రూపంలో గ్రామ గ్రామన తిరుగుతూ గెలిపించాలని విన్నవించారు. ఇక, శనివారం సాయంత్రం మూడు గంటలకు చింతాద్రి పేటలో జరిగిన సభతో తన ఎన్నికల ప్రచారాన్ని కరుణానిధి ముగించనున్నారు. ఈ సమయంలో ఆయన చేయబోయే ప్రసంగం మీద సర్వత్రా దృష్టి పెట్టి ఉన్నారు.