అవినీతి రహిత పాలన తథ్యం
ఆ నోట్ల కట్టలతో అనుమానాలేన్నో
అరవకురిచ్చిలో స్టాలిన్
సుడిగాలి పర్యటనతో ప్రచారం
సాక్షి, చెన్నై: ఆరోసారి డీఎంకే అధినేత ఎం.కరుణానిధి సీఎం కాబోతున్నారని ఆ పార్టీ దళపతి ఎంకే స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. అవినీతి, కమీషన్ రహిత పాలనను అందిస్తామని వ్యాఖ్యానించారు. కరూర్, తిరుప్పూర్‌లలో పట్టుబడ్డ నోట్ల కట్టలు ఎన్నో అనుమానాలకు తావిస్తున్నాయని పేర్కొన్నారు. అరవకురిచ్చిలో బుధవారం స్టాలిన్ సుడిగాలి పర్యటన చేశారు. తంజావూరు, అరవకురిచ్చిలలో ఎన్నికలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. ఇక్కడ సాగిన ఓటుకు నోట్ల కట్టల వ్యవహారాన్ని ఎన్నికల యంత్రాంగం తీవ్రంగా పరిగణించింది. విచారణకు రెండు ప్రత్యేక బృందాల రంగంలోకి దిగాయి. ఇక్కడకు అదనపు పారామిలటరీ బలగాల్ని పంపించి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అరవకురిచ్చి బరిలో ఉన్న తమ అభ్యర్థి కేసీ పళనిస్వామికి మద్దతుగా డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ బుధవారం సుడిగాలి పర్యటన చేశారు.
నియోజకవర్గంలో రోడ్‌షో రూపంలో చక్కర్లు కొట్టారు. అక్కడక్కడ ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ 232 స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడబోతున్నాయని వ్యాఖ్యానించారు. అధినేత కరుణానిధి ఆరో సారి సీఎం కావడం తథ్యం అని ఇప్పటికే ధ్రువీకరించ బడిందని, మరికొన్ని గంటల్లో అధికార పూర్వక ప్రకటన వెలువడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. ఇక్కడి అన్నాడీఎంకే అభ్యర్థి సెంథిల్ బాలాజీ ఇది వరకు కరూర్ నుంచి పోటీ చేశారని, అక్కడి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్న సమాచారంతో మకాంను ఇక్కడికి మార్చరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.
రవాణామంత్రిగా బస్సు చార్జీల్ని పెంచడం మొదలు ఆ శాఖలో చేతికి అందింది దోచుకోవడం వరకు పనితనాన్ని ప్రదర్శించిన సెంథిల్ బాలాజీకి గట్టి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. తాను వేషం మార్చానంటూ పలువురు ఎద్దేవా చేస్తున్నారని గుర్తు చేశారు. తానేమీ వేషం మార్చలేదని, మనకు మనమే సమయంలో విద్యార్థులు, యువతతో కలిసి సాగించిన సమీక్షలు, సమావేశాల అనంతరం తాను కూడా విద్యార్థిగా, యువతగా మారినట్టు వ్యాఖ్యానించారు. తానేదో షూటింగ్‌ల కోసం ఈ వేషం మార్చలేదని, మీటింగ్‌ల కోసం అన్నది గుర్తుంచుకోవాలని సూచించారు. విద్యార్థులు వడ్డీ మాఫీ చేయాలని తనను కోరారని, ఇదే విషయాన్ని అధినేత కరుణానిధి దృష్టికి తీసుకెళ్లగా, ఏకంగా రుణాల్ని మాఫీ చేద్దామని చెప్పినట్టు వివరించారు. ప్రజాహిత పాలన మరికొన్ని గంటల్లో రాబోతోందని, అవినీతి , కమీషన్ రహిత సుపరిపాలనను ప్రజలకు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇదే నియోజకవర్గంలో తమ అభ్యర్థి కలైయరసన్‌కుమద్దతుగా ఎండీఎంకే నేత వైగో ప్రచారం సాగించారు.
కరుణే సీఎం!
Published Thu, May 19 2016 3:03 AM | Last Updated on Mon, Sep 4 2017 12:23 AM
Advertisement