విజయకాంత్ మోసపోకూడదు: వైగో
టీనగర్: కరుణానిధి చేత విజయకాంత్ మోసపోకూడదని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో హితవు పలికారు. ప్రజా కూటమి వెబ్‌సైట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఎగ్మూరులోగల ఎండిఎంకే కార్యాలయంలో మంగళవారం జరిగింది. ఇందులో ప్రజాకూటమి సమన్వయకర్త వైగో, సీపీఎం కార్యదర్శి రామకృష్ణన్, సిపిఐ కార్యదర్శి ముత్తరసన్, వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్ పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వైగో విలేకరులతో మాట్లాడుతూ నేటి నుంచి ఈ వెబ్‌సైట్ ఇతర సామాజిక మాధ్యమాలలో తమ కూటమి విశేషాలు, ప్రకటనలు వంటివి పొందుపరుస్తామన్నారు. వీటి ద్వారా ప్రజలు తమతో నేరుగా సంప్రదించవచ్చన్నారు. రాష్ట్రంలో 65 శాతం ప్రజల మనోభావాలను ప్రతిఫలించే విధంగా మక్కల్ నలకూట్టని ( ప్రజాకూటమి) ఏర్పాటైందన్నారు. తమిళ మానిల కాంగ్రెస్‌ను తమ కూటమికి ఆహ్వానించామని, ఇంతవరకు వారు నిర్ణయం తీసుకోలేదన్నారు.
డీఎండీకేను డీఎంకే కూటమికి ఆహ్వానించడం గురించి మంగళవారం కరుణానిధి మాట్లాడుతూ పండు పక్వానికి వచ్చిందని, ఏ సమయంలో పాలలో పడుతుందోనని వేచిచూస్తున్నట్లు తెలిపారన్నారు. ఈ పండు రాలి స్వచ్ఛమైన పాలలో పడితే బాగుంటుందని, అయితే డిఎంకే అవినీతి విషం కలిగిన పాలని, అందులో పడకూడదని అన్నారు. ఈ విషయంలో విజయకాంత్ మోసపోకూడదని హితవు పలికారు.