కెప్టెన్ తేల్చేనా..! | Executive Committee meeting today in St. George Castle | Sakshi
Sakshi News home page

కెప్టెన్ తేల్చేనా..!

Published Sat, Jan 9 2016 8:01 AM | Last Updated on Sun, Sep 3 2017 3:19 PM

కెప్టెన్ తేల్చేనా..!

కెప్టెన్ తేల్చేనా..!

♦ నేడు కార్యవర్గం భేటీ
పెరంబలూరుకు నేతలు
సచివాలయం సెట్ లో ఆంతర్యం
సాక్షి, చెన్నై:
పొత్తు విషయంలో తన నిర్ణయాన్ని డీఎండీకే అధినేత విజయకాంత్ తేల్చేనా!? అన్న ఎదురు చూపులు పెరిగాయి. పెరంబలూరు వేదికగా శనివారం డీఎండీకే సర్వ సభ్య సమావేశానికి సిద్ధమైంది. ఈ వేదిక ప్రవేశ మార్గంలో సెయింట్ జార్జ్ కోట(సచివాలయం)ను తలపించే రీతిలో సెట్ వేసి ఉండటంతో ఆంతర్యాన్ని తెలుసుకునే పనిలో పొత్తు కోసం ప్రయత్నించే పార్టీలు నిమగ్నయ్యాయి.
 
 పార్టీ ఆవిర్భావంతో తొలి ఎన్నికల్లో  తానొక్కడినే అసెంబ్లీ మెట్లు ఎక్కినా, తన కంటూ ప్రత్యేక ఓటు బ్యాంకును కాపాడుకుంటూ వస్తున్న నేత విజయకాంత్. తదుపరి ఎన్నికలతో ప్రధాన ప్రతి పక్ష నేతగా అవతరించారు. సీఎం కావాలని కలలు కంటూ వస్తున్న ఈ నేతకు రానున్న అసెంబ్లీ ఎన్నికలు సవాల్‌గా మారాయి. ప్రస్తుతం రాజకీయం అంతా ఆయన చుట్టూ పరిభ్రమిస్తోంది. ఓ వైపు ప్రజా కూటమి, మరో వైపు బీజేపీ, మరొక వైపు డీఎంకే విజయకాంత్‌కు తలుపులు తెరిచాయి.
 
  తమతో పనిచేయాలని ఆయన్ను తమ వైపు ఆకర్షించేందుకు యత్నిస్తున్నాయి. అయితే, ఎప్పటిలాగే మౌనం వహిస్తున్న విజయకాంత్ మరికొన్ని గంటల్లో తన నిర్ణయాన్ని ప్రకటించి, పొత్తు విషయం తేలుస్తారా? గతంలో వలే మెలిక పెడతారా? అని పొత్తు కోసం ఆరాట పడుతున్న పార్టీలు తర్జనభర్జన పడుతున్నాయి. పెరంబలూరు వేదికగా జరిగే పార్టీ సమావేశం మేరకు తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఇది వరకే విజయకాంత్ స్పష్టం చేశారు. ఇప్పుడు పార్టీ కార్యకర్త, ద్వితీయ శ్రేణి నాయకులు, అగ్రనాయకులతో చర్చించి నిర్ణయాన్ని వెల్లడించేందుకు విజయకాంత్  సిద్ధమయ్యారు.
 
 ఏర్పాట్లు పూర్తి
 శనివారం పెరంబలూరులో రెండు వేల మంది వరకు ప్రతినిధులు సమావేశానికి హాజరవుతారని అంచనా. మెజారిటీ శాతం మంది పార్టీ వర్గాలు డీఎంకేతో కలిసి నడుదామన్న సూచన ఇచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. రానున్న ఎన్నికల ద్వారా బలాన్ని మరింతగా పెంచుకోవాలంటే, డీఎంకేతో చెలిమి ద్వారానే సాధ్యమన్న నిర్ణయాన్ని ఇప్పటికే పలువురు డీఎండీకే వర్గాలు విజయకాంత్ దృష్టికి తీసుకెళ్లాయని సమాచారం.
 
  అయితే, సమావేశంలో డీఎంకేపై తనదైన శైలిలో తిట్ల పురాణం అందుకోకుండా విజయకాంత్ వ్యవహరించిన పక్షంలో ఆ పార్టీ కూటమి వైపుగా తలొగ్టినట్టే. విజయకాంత్ ధోరణిలో మార్పు లేని పక్షంలో ఆశల్ని డీఎంకే వదులుకోవాల్సిందే.  ఇక, డీఎంకేతో పాటు ప్రజా కూటమి, బీజేపీలను సైతం గందరగోళ పరిస్థితిలోకి నెట్టే విధంగా తన వేదిక ప్రవేశ మార్గాన్ని విజయకాంత్ ఏర్పాటు చేయించడం గమనార్హం.
 
 ఎప్పుడూ ప్రజా సమూహం తన వెంట ఉన్నట్టుగా  ఫ్లెక్సీలు, బ్యానర్లు వేయించుకునే విజయకాంత్ ఈసారి సెయింట్ జార్జ్ కోట (సచివాలయం) సెట్ వేసి ఉండటంపై ఆసక్తి రేపింది; చర్చకూ తావిచ్చింది!  అలాగే  ఓ వైపు తాను, మరో వైపు తన సతీమణి ప్రేమలత ఫొటో ఉండేలా చేయడం కూడా రాజకీయచర్చకు తెరలేపింది. డీఎంకే తన ఊహల్లో లేనిపక్షంలో బీజేపీ తనను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తుందా, ప్రజా కూటమి తన నేతృత్వానికి కట్టు బడుతుందా..? అన్న విషయాన్ని తేల్చుకునేందుకు ఈ సరికొత్త సెట్ అంటూ డీఎండీకే వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement