ప్రచారానికి రెడీ!
సాక్షి, చెన్నై : ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రజాకూటమి కార్యాచరణ సిద్ధం చేసుకుంది. ఈనెల 26వ తేదీన మదురై వేదికగా జరగనున్న మహానాడుతో రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త మార్పు సంతరించుకోనున్నదని ఆ కూటమి వర్గాలు ప్రకటించాయి. ఫిబ్రవరి ఏడో తేదీ నుంచి కూటమి నేతలు కలసి కట్టుగా ప్రచార బాటకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఎండీఎంకే, సీపీఎం, సీపీఐ, వీసీకేలతో కలసి ప్రజా కూటమి ఇటీవల ఆవిర్భవించిన విషయం తెలిసిందే. తమతో దోస్తీ కట్టాలని ఇప్పటికే డీఎండీకే అధినేత విజయకాంత్, తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్‌లకు ప్రజా కూటమి నేతలు పిలుపునిచ్చి ఉన్నారు.
విజయకాంత్ మాత్రం ఆ కూటమికి మద్దతుగా వ్యాఖ్యలు చేస్తున్నా, జీకేవాసన్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మదురై వేదికగా ఈ నెల 26వ తేదీన బ్రహ్మాండ మహానాడుకు ఈ కూటమి చర్యలు చేపట్టింది. ఈ వేదిక మీద విజయకాంత్, వాసన్ ప్రత్యక్షమైన పక్షంలో రాష్ట్రంలో మెగాకూటమిగా ప్రజా కూటమి అవతరించడం ఖాయం. అయితే, ఇది సాధ్యమయ్యేనా అన్న ప్రశ్న సైతం బయలు దేరి ఉన్న వేళ గురువారం ప్రజా కూటమిలోని ఎండీఎంకే నేత వైగో, సీపీఎం నేత రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్, వీసీకే నేత తిరుమావళవన్ సంయుక్తంగా మీడియా ముందుకు వచ్చి మార్పున కు వేదికగా ఆ మహానాడు నిలవబోతున్నదని ధీమా వ్యక్తం చేయడం విశేషం.
ప్రచారానికి సిద్ధం:
ఈ నలుగురు నేతలు ఉదయం సమావేశమయ్యారు. మహానాడు ఏర్పాట్లు, ప్రచార పర్వానికి సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేశారు. తదుపరి మీడియాతో నలుగురు నేతలు మాట్లాడారు. మదురై వేదికగా జరగనున్న మహానాడు రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త మార్పును తీసుకురాబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. తమ కూటమికి బీటలు తప్పవని వ్యాఖ్యలు చేసిన వాళ్లు,వ్యాంగ్యాస్త్రాలు సంధించిన వారికి చెంప పెట్టుగా ఈ మహానాడు నిలవబోతున్నదన్నారు. తమ కూటమి వర్గాలు సమష్టిగా ప్రజా సమస్యలపై పోరుబాటను ఉధృతం చేశారని వివరించారు. ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లే విధంగా కార్యక్రమాల్ని విస్తృతం చేసినట్టు పేర్కొన్నారు.
తమ కూటమి ఎన్నికల ప్రచారానికి ఫిబ్రవరి ఏడో తేదీన శ్రీకారం చుట్టబోతున్నదని వివరించారు. ఆరో తేదీన పుదుచ్చేరిలో భారీ బహిరంగ సభకు చర్యలు చేపట్టామని, ఏడో తేదిన ఎన్నికల ప్రచారానికి కడలూరు వేదికగా శ్రీకారం చుట్టనున్నామని తెలిపారు. అదే రోజు నాగపట్నంలో, ఎనిమిదో తేదిన తిరువారూర్, తంజావూరుల్లో, తొమ్మిదో తేదిన పుదుకోట్టై, శివగంగైలలో ఎన్నికల ప్రచారం సాగుతుంద న్నారు. తదుపరి పర్యటనల వివరాలు ఆ సమయంలో వెలువరిస్తామని, తొలి విడత పర్యటనలో అందరూ కలసి కట్టుగానే ప్రజల్లోకి వెళ్తామని, తదుపరి ఆయా ప్రాంతాల్లో గెలుపు లక్ష్యంగా నేతలందరూ తలా ఓ వైపుగా పర్యటనలు సాగిస్తారని చెప్పారు.