డీల్ ఓకే !
Published Fri, Jan 24 2014 12:53 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
చెన్నై, సాక్షి ప్రతినిధి: కేంద్రంలో అధికారం మాదేనన్న ధీమాతో ముందుకు వెళుతున్న భారతీయ జనతా పార్టీ పొత్తుల ఖరారులో సైతం వడివడిగా అడుగులేస్తోంది. ఎండీఎంకేతో పొత్తు ఇప్పటికే ఖరారైపోగా సీట్ల సర్దుబాటుపై గురువారం చర్చలకు శ్రీకారం చుట్టారు.కేంద్రంలో అధికారం కోసం అర్రులు చాస్తున్న కాంగ్రెస్, బీజేపీలు ప్రాంతీయ పార్టీలతోనే పీఠం దక్కించుకోగలమనే సత్యాన్ని గ్రహించాయి. కాంగ్రెస్ మద్దతును కోరేవారు కరువైపోగా, బీజేపీవైపు అనేక పార్టీలు మొగ్గుచూపుతున్నాయి. ఇదే అదనుగా బీజేపీ సైతం వారి చెంత చేరేందుకు చొరవచూపుతోంది. అన్నాడీఎంకే, డీఎంకేలు రెండునూ తమ కూటమిలో చేరే
అవకాశం లేకపోవడంతో ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టడంపై బీజేపీ దృష్టి సారించింది. పొత్తు సూత్రప్రాయంగా ఖరారైపోగా వాటికి తుదిరూపు ఇచ్చేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ ఎండీఎంకే కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. పార్టీ అధినేత వైగోను దుశ్శాలువతో సన్మానించి చర్చలు ప్రారంభించారు.
రాష్ట్రంలో బీజేపీ ఇటీవలే కొంత పుంజుకున్నా తమిళ భాషాపరమైన ఓటు బ్యాంకు స్థాయికి చేరుకోలేదు. ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతున్న రాష్ట్రంలో ఆయా నేతలదే ఆధిక్యతగా ఉంది. ఈ కారణంగా బీజేపీ నుంచి తమ వాటాగా అధికశాతం సీట్లు పొందేందుకు వైగో పట్టుపట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 39, పుదుచ్చేరి ఒకటి కలుపుకుని మొత్తం 40 లోక్‌సభ స్థానాల్లో సీట్ల సర్దుబాటు చేసుకోవాల్సి ఉంది. అయితే బీజేపీ కూటమిలోకి ఇంకా ఏఏ పార్టీలు వస్తాయో ఇంకా తేలలేదు. ఈ పరిస్థితుల్లో వైగో కోరుతున్న శాతం సీట్లపై బీజేపీ ఇప్పుడే హామీ ఇవ్వలేదు. పీఎంకే, డీఎండీకే పార్టీలు సైతం బీజేపీ పంచన చేరిన పక్షంలో మొత్తం 40 సీట్లను నాలుగు భాగాలు చేయాల్సి ఉంటుంది. ఇటువంటి సంకట స్థితిలో బీజేపీ, ఎండీఎంకే పార్టీల మధ్య గురువారం సాగిన సీట్ల సర్దుబాటు చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. అయినా ఆ రెండు పార్టీలు శుక్రవారం మరోసారి సమావేశం అయ్యే అవకాశం ఉంది. డీఎండీకే అధినేత విజయకాంత్ పొత్తులపై తన నిర్ణయాన్ని ప్రకటిస్తేగానీ రాష్టంలోని అన్ని పార్టీల చర్చలు కొలిక్కిరావు. ఎండీఎంకే చర్చల్లో పాల్గొనాల్సిన బీజేపీ డిల్లీ దూత మురళీధర్‌రావు అనివార్య కారణాల వల్ల చెన్నై చేరుకోలేకపోయారు.
Advertisement
Advertisement