సాక్షి, చెన్నై : బీజేపీ కూటమికి టాటా చెప్పేందుకు ఎండీఎంకే సిద్ధం అవుతోంది. సోమవారం జరిగే పార్టీ జిల్లాల కార్యదర్శుల సమావేశంలో కూటమిలో కొనసాగాలా? వద్దా! అన్న అంశంపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. మెజారిటీ సభ్యులు టాటా చెప్పాలన్న డిమాండ్ తో ఉన్న దృష్ట్యా, ఇక బీజేపీ కూటమి చీలినట్టేనన్న ప్రచారం బయలు దేరింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూట మితో కలసి ఎండీఎంకే పయనం సాగించిన విషయం తెలిసిందే. అయి తే, ఇటీవల కేంద్రం శ్రీలంకకు అనుకూలంగా వ్యవహరిస్తుండడంతో వైగో స్వరం పెంచారు. పీఎం మోదీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించే పనిలో పడ్డారు. ఇది వివాదానికి దారి తీసింది. దీంతో కూటమి నుంచి వైదొలగాలన్న ఒత్తిడి వైగో మీద పెరి గింది. పార్టీ శ్రేణులందరూ బీజేపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే పనిలో పడ్డారు. అయితే, కూటమి కొనసాగాలన్న కాంక్షతో ఎండీఎంకే నేత వైగోపై చేసిన వ్యాఖ్యల్ని హెచ్ రాజా వెనక్కు తీసుకున్నారు. తామిద్దరం మిత్రులం అన్న పల్లవిని అందుకున్నారు. ఈ క్రమంలో ఆగమేఘాలపై పార్టీ జిల్లాల కార్యదర్శుల సమావేశానికి వైగో పిలుపు నివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
నేడు సమావేశం
సోమవారం ఉదయం ఎగ్మూర్‌లోని తాయగంలో పార్టీ జిల్లాల కార్యదర్శుల సమావేశం జరగనుంది. అన్ని జిల్లాల కార్యదర్శులు తప్పనిసరిగా హాజరు కావాలన్న ఆదేశాల్ని వైగో ఇచ్చారు. దీంతో ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనన్న ఎదురు చూపులు పెరిగాయి. బీజేపీ తమతో అనుసరించిన విధానాన్ని ఖండిస్తూ ఆ కూటమి నుంచి వైదొలగుతూ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అధికంగా ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజా వెనక్కు తగ్గినా, కూటమిలోని వైగోను హెచ్చరించే విధంగా కమలనాథులు చేసిన వ్యాఖ్యల్ని ఖండించే విధంగా బీజేపీ అధిష్టానం ఎలాంటి ప్రకటన చేయక పోవడాన్ని ఎండీఎంకే వర్గాలు తీవ్రంగా పరిగణించా యి. ఆ కూటమికి టాటా చెప్పేసి, భవిష్యత్తు కార్యాచరణ దిశగా అడుగులు వేసేందుకు ఈ సమావేశం వేదిక కానుందని ఎండీఎంకే వర్గాలు పేర్కొంటుండడం గమనార్హం.
టాటా చెప్పేద్దామా?
Published Mon, Dec 8 2014 2:09 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement