కమలంతో కటీఫ్
చెన్నై, సాక్షి ప్రతినిధి : గడిచిన పార్లమెంటు ఎన్నికల సమయంలో రాష్ట్ర బీజేపీ శాఖ ఏడు ప్రాంతీయ పార్టీలను ఎన్‌డీఏ కూటమిలో చేర్చుకుని బరిలోకి దిగింది. ఎండీఎంకే, పీఎంకే, డీఎండీకే తదితర పార్టీలన్నీ పార్లమెంటు సీట్లను పంచుకుని పోటీకి దిగాయి. బీజేపీ, పీఎంకేలు చెరొక స్థానం దక్కించుకున్నాయి. 2016 అసెంబ్లీ ఎన్నికల వరకు కూటమి కొనసాగుతుందని బీజేపీ ఆశించింది. అయితే ఇటీవల తమిళనాడు, శ్రీలంకల మధ్య చోటుచేసుకున్న వివాదాస్పద పరిణామాలతో బీజేపీ కూటమిలో బీటలు మొదలయ్యూయి. తమిళుల ఆత్మాభిమానం దెబ్బతినేలా ప్రధాని నరేంద్రమోదీ వ్యవహరిస్తున్నారంటూ ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో విమర్శలు గుప్పించడంతో రెండు పార్టీల మధ్య రాజకీయ యుద్ధం మొదలైంది. మోదీని విమర్శిస్తే రాష్ట్రంలో క్షేమంగా తిరగలేవని వైగోను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హెచ్ రాజా హెచ్చరించారు. మోదీని విమర్శించేందుకు ప్రతిపక్షాలే భయపడుతున్నాయి, కూటమిలో ఉంటూ విమర్శలు తగవని వైగోకు బీజేపీ జాతీయ నేత ఇల గణేశన్ హితవు పలికారు. విమర్శలు, ప్రతివిమర్శలు సాగుతున్న తరుణంలో కూటమిలో చీలిక తప్పదని రాజకీయ నిపుణులు విశ్లేషించారు.
ఉన్నత స్థాయి సమావేశం
చెన్నై ఎగ్మూరులోని ఎండీఎంకే కేంద్ర కార్యాలయంలో సోమవారం 12 మంది సభ్యులతో కూడిన పార్టీ ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి వైగో అధ్యక్షతన ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభంకాగా ఎన్‌డీఏలో కొనసాగడమా లేక వైదొలగడమా అనే ఏకైక అజెండాపై చర్చించారు. వైదొలగడమే మంచిదని అధికశాతం సూచించారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యదర్శులతో వైగో సమావేశమై ఉన్నతస్థాయి కమిటీ చేసిన తీర్మానాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర కార్యదర్శులు సైతం కమిటీ తీర్మానాన్ని బలపరచడంతో ఎన్‌డీఏ నుంచి వైదొలుగుతున్నట్లు వైగో ప్రకటించారు.
వైదొలగడానికి కారణాలు ఇవే
ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారానికి శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేను ఆహ్వానించడం, త్వరలో జరగనున్న శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో రాజపక్సే గెలుపు కోరుతూ మోదీ శుభాకాంక్షలు తెలపడం, ముల్లైపెరియార్ వ్యవహారంలో కేంద్రం ఏకపక్ష తీరు, అనేక ఇతర అంశాల్లో తమిళుల ఆత్మాభిమానం దెబ్బతినేలా కేంద్రం వ్యవహరించడం వంటి అంశాలను కమలనాథుల కూటమి నుంచి వైదొలగడానికి వైగో కారణాలుగా చూపారు.