
'బొజ్జల సినిమా డైలాగులు మాట్లాడుతున్నారు'
చిత్తూరు : ఎర్ర చందనం కూలీల ఎన్కౌంటర్కు నిరసనగా చిత్తూరు కలెక్టరేట్ ముట్టడికి ఎండీఎంకే అధినేత వైగో శుక్రవారం వేలూరు నుంచి భారీ ర్యాలీగా బయల్దేరారు. ఆయనతో పాటు తమిళనాడులోని ఇతర పార్టీ నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైగో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు మానవత్వానికి దూరంగా ఉన్నాయన్నారు. అంతం కాదు...ఆరంభం మాత్రమే అని అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి సినిమా డైలాగులు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
ఎన్కౌంటర్లో మృతి చెందిన కూలీల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఒక్కొక్కరికీ రూ.20 లక్షలు చెల్లించాలని వైగో డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం కావాలనే బయట ఉన్న కూలీలను తీసుకువెళ్లి ఎన్కౌంటర్ చేసిందని ఆయన ఆరోపించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ జైళ్లలో ఉన్న కూలీల బాధ్యతను తమిళనాడు ప్రభుత్వానిదే అని వైగో అన్నారు. కాగా తమిళనాడు-ఏపీ సరిహద్దుల్లో పోలీసులు భారీగా మోహరించారు. ర్యాలీగా వస్తున్న వైగో సహా పలువురు కార్యకర్తలను వేలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.