సీట్ల పందేరం డీఎండీకేకు పద్నాలుగు
పీఎంకే, బీజేపీలకు తలా ఎనిమిది
ఎండీఎంకేకు ఏడు
రెండు రోజుల్లో అధికారిక {పకటన
బీజేపీలోకి ఎన్‌ఆర్ కాంగ్రెస్
సాక్షి, చెన్నై:
రాష్ర్టంలో కమలం వికసించింది. మెగా కూటమికి పునాదులు పడడంతో సీట్ల పందేరంలో బీజేపీ మిత్రులు బిజీ బిజీగా ఉన్నారు. డీఎండీకేకు 14, పీఎంకేకు ఎనిమిది, బీజేపీకి ఎనిమిది, ఎండీఎంకేకు ఏడు, ఇతర మిత్రులకు మూడు సీట్లు కేటాయించేలా చర్చలు సాగుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల ఎంపికలో పార్టీలు పట్టువీడడం లేదు. మరో రెండు రోజుల్లో అధికారికంగా కూటమిని ప్రకటించి, ఎన్నికల ప్రచార బరిలోకి దిగనున్నారు. పుదుచ్చేరిలోని ఎన్‌ఆర్ కాంగ్రెస్ బీజేపీతో పొత్తుకు సిద్ధ పడింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు డీఎంకే, అన్నాడీఎంకేలు తమను అక్కున చేర్చుకునేనా...! అన్న ఎదురు చూపుల్లో బీజేపీ వర్గాలు ఉండే వారు. ఆ రెండు ప్రధాన పార్టీలు తిరస్కరించడంతో చివరకు ఒంటరిగా రాష్ట్రంలో మిగిలారు. గత లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలను బీజేపీ ఒంటరిగానే ఎదుర్కొవాల్సి వచ్చింది. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోడీ పేరు తెరమీదకు రావడంతో రాష్ర్టంలోని కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది.
రాష్ట్రంలో అన్నాడీఎంకే, డీఎం కేలకు ప్రత్యామ్నాయంగా తమ నేతృత్వంలో మెగా కూటమి లక్ష్యంగా ప్రయత్నాల్లో పడ్డారు. వైగో నేతృత్వంలోని ఎండీఎంకే, పచ్చముత్తు పారివేందన్ నేతృత్వంలోని ఐజేకేలతో పాటు కొంగు మక్కల్ కట్చి, కొంగు దేశీయ కట్చి, పుదియ నిధి కట్చి తదితర పార్టీలు బీజేపీ వెంట నడిచేందుకు సిద్ధపడ్డాయి. మరింత బలం చేకూరాలంటే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న డీఎండీకేను, వన్నియర్ సామాజిక వర్గంతో నిండిన పీఎంకేను తమ వెంట తిప్పుకోవడమే లక్ష్యంగా బీజేపీ వర్గాలు తీవ్రంగా కుస్తీలు పట్టారు. ఆ పార్టీ నాయకులు ఇళ్లు, కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. చివరకు బీజేపీ అధిష్టానం పెద్ద రంగంలోకి దిగారు.
ఫలించిన మంతనాలు: బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఢిల్లీ నుంచి పావులు కదిపారు. ఆయనతో పాటు పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సైతం డీఎండీకే నేత విజయకాంత్, పీఎంకే నేత రాందాసుతో వేర్వేరుగా మాట్లాడినట్టు సమాచారం. దీంతో రాష్ట్రంలోని బిజేపి ప్రధాన నేతలు పొన్ రాధాకృష్ణన్, ఇలగణేషన్ , మోహన్ రాజ్ తదితరులు గురువారం ఢిల్లీకి ఉరకలు తీశారు. ఢిల్లీ నుంచి ఎలాంటి రాయబారం సాగించారో ఏమోగానీ అదే రోజు రాత్రి తాము బీజేపీతో కూటమికి రెడీ అవుతూ, సీట్ల పందేరానికి సిద్ధమని డీఎండీకే, పీఎంకే అధినేతలు విజయకాంత్, రాందాసు ప్రకటించారు.
సీట్ల పందేరం:
డీఎండీకే, పీఎంకే బీజేపీలోకి చేరడంతో కమలనాథుల ఆనందానికి అవధులు లేకుండా పోయూరుు. ఇన్నాళ్లు అన్నాడీఎంకే, డీఎంకేల మోచేతి నీళ్లు తాగాల్సిన పరిస్థితి ఉండడం, ఇప్పుడు ఆ రెండు ప్రధాన కూటముల్ని తాము ఢీకొట్టబోతోండడంతో బీజేపీ వర్గాలు ఆనందంలో మునిగి తేలుతున్నారు.పొత్తుకు రెడీ అని గురువారం రాత్రి ప్రకటించారో లేదో శుక్రవారం ఉదయం నుంచి సీట్ల పందేరం ప్రారంభమైంది. ఢిల్లీ వెళ్లిన నేతలు హుటాహుటిన చెన్నైకు ఉదయాన్నే చేరుకున్నారు.
కమలాలయంలో సీట్ల పందేరం చర్చల్లో బిజీ బీజీ అయ్యారు. పీఎంకే అధ్యక్షుడు జీకే మణి నేతృత్వంలోని ఆ పార్టీ బృందం టీ నగర్‌లోని కమలాలయంలో రెండు గంటల పాటు సీట్ల పంపకాల చర్చల్లో మునిగారు. తమకు పది సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టగా, చివరకు ఎనిమిదికి సర్దుకున్నట్టు తెలిసింది. అలాగే సాయంత్రం కోయంబేడులోని డీఎండీకే కార్యాలయూనికి చేరుకున్న బీజేపీ కమిటీ సభ్యులు సీట్ల పంపకాలపై చర్చించారు. తమకు 18 సీట్లు కావాలని డీఎండీకే డిమాండ్ చేయగా, 14 సీట్లకు ఒకే అయినట్టు తెలిసింది. కొన్ని స్థానాల్ని బీజేపీ, డీఎండీకే, పీఎంకే ఆశిస్తుండడంతో సీట్ల పందేరం కొలిక్కి రావాల్సి ఉంది.
ఇవే సీట్లు
ఇప్పటికే పీఎంకే పది స్థానాల బరిలో అభ్యర్థుల్ని రంగంలోకి దించింది. వాటినే తమకు కేటారుుంచాలని పట్టుబడుతోంది. కూటమి ధర్మం మేరకు రెండు స్థానాల్ని వదులుకునేందుకు సిద్ధ పడుతున్నా, ధర్మపురి సీటును కేటారుుంచాల్సిందేనని కోరుతోంది. ఇక్కడి నుంచి ఆ పార్టీ యువజన నేత అన్భుమణి బరిలోకి దిగనున్నారు. డీఎండీకే కాంచీపురం, శ్రీ పెరంబదూరు, తిరువళ్లూరు, ధర్మపురి, ఆరణి, విల్లుపురం, కళ్లకురిచ్చి, సేలం, దిండుగల్, విరుదునగర్, కృష్ణగిరి, ఈరోడ్, కడలూరు, తిరునల్వేలి స్థానాల్ని ఆశిస్తోంది. ఇందులో ధర్మపురి కోసం పీఎంకే, శ్రీ పెరందూరు కోసం బీజేపీ, కాంచీపురం కోసం ఎండీఎంకేలు పట్టుబడుతున్నాయి. ఈ సీట్లను వదలు కోవాల్సి వస్తే, తమకు ప్రత్యామ్నాయంగా అరక్కోణం, తిరుప్పూర్, తిరువణ్ణామలై సీట్లను కేటాయించాలన్న డిమాండ్‌ను డీఎండీకే తెరపైకి తెచ్చింది. ఎవరికి ఎన్ని సీట్లు కేటాయించాలన్న దానిపై మల్లగుల్లాలు ఎదురుకావడంతో త్వరితగతిన సీట్ల పందేరం ముగించేందుకు బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగనుంది. ఈ క్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ రెండు రోజుల్లో చెన్నై రానున్నారని, ఆయన సమక్షంలో అధికార పూర్వకంగా కూటమి ప్రకటన వెలువడనున్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఎన్‌ఆర్ కాంగ్రెస్
పుదుచ్చేరిలోని ఎన్‌ఆర్ కాంగ్రెస్ బీజేపీతో దోస్తీకి సిద్ధ పడింది. పుదుచ్చేరి సీటును ఆ పార్టీ ఆశిస్తుండడంతో బీజేపీ వర్గాలు తలలు పట్టుకుంటున్నాయి. ఈ సీటును పీఎంకే సైతం కోరుతుండడం గమనార్హం. తాము బీజేపీతో దోస్తీ కట్టనున్నామని, ఈ నెల పన్నెండున అధికార పూర్వకంగా అభ్యర్థిని ప్రకటించనున్నామని ఎన్‌ఆర్ కాంగ్రెస్ అధినేత, సీఎం రంగస్వామి పేర్కొన్నారు.
కమల వికాసం
Published Sat, Mar 8 2014 2:35 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement