డీఎండీకే అధినేత విజయకాంత్ తీరుతో కమలనాథులు విసిగి వేసారినట్టున్నారు. ఇక, ఆయనతో ఎలాంటి చర్చలు సాగించ కూడదన్న నిర్ణయానికి వచ్చేశారు. ఇందుకు తగ్గట్టుగామంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై వ్యాఖ్యానించారు. ఒంటరి నినాదంతో ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు తగ్గ కసరత్తుల్లో మునిగారు.
చెన్నై : డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయం తామేనని చాటుకునే ప్రయత్నంలో ఢీలా పడ్డ కమలనాథులకు ప్రాంతీయ పార్టీల తీరు తీవ్ర అసహనానికి గురిచేస్తున్నట్టుంది. పొత్తు వ్యవహారంలో పీఎంకే తన స్పష్టతను తెలియజేసినా, నాన్చుడు ధోరణితో ఒంటరి నినాదాన్ని డీఎండీకే అందుకున్నా, ఆ ఇద్దరు తమతో కలసి వస్తారన్న ఆశల పల్లకిలో ఇన్నాళ్లు కమలనాథులు ఊగిసలాడారని చెప్పవచ్చు.
అయితే, పొత్తు మంతనాల్లో తమతో ఆ పార్టీల నేతలు వ్యవహరిస్తున్న తీరుతో కలత చెందిన కమలనాథులు, ఇక వారిని తమ దరి దాపుల్లోకి చేర్చకూడదన్న నిర్ణయానికి వచ్చేసినట్టుంది. ఇం దుకు తగ్గ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, ఇక చర్చల్లేవ్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించడం గమనార్హం.
ఒంటరి కసరత్తు : డీఎండీకే, పీఎంకేలు ఇక తమతో కలసి వచ్చేది అనుమానం గానే మారడంతో తమ బలాన్ని చాటుకునేందుకు కమలనాథులు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో నెలకొని ఉన్న రాజకీయ ఎత్తుగడల నేపథ్యంలో తమదైన శైలిలో రాజకీయం సాగించేందుకు కసరత్తుల్లో మునిగారు. ఈ సారికి ఆయా పార్టీలు తమ దైన బాణిలో పయనిస్తుండడంతో, ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలచుకుని ఓట్ల చీలిక ద్వారా లబ్ధిపొందాలన్న వ్యూహంతో ముందుకు సాగేందుకు కమలనాథులు నిర్ణయించి ఉన్నారు.
ఇందుకు తగ్గ కార్యచరణను సిద్ధం చేసే పనిలో రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు తమిళి సై నిమగ్నం అయ్యారు. మంగళవారం టీ నగర్‌లోని కమలాలయంలో ఒంటరి నినాదాన్ని అందుకునేందుకు తగ్గ కసరత్తుల్ని చేపట్టారు. రాష్ర్టంలోని అన్ని జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ కార్యవర్గంతో ఆమె సమాలోచించారు. ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు తగ్గ బలా బలాలను జిల్లాల వారీగా సమీక్షించారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి ఉన్న బలాన్ని అంచనా వేశారు. ఎన్నికల బరిలో నిలబడేందుకు సిద్ధంగా ఉన్న అభ్యర్థుల వివరాల్ని పరిశీలించారు.
ఇందుకు తగ్గ నివేదికను ఢిల్లీకి పంపించేందుకు నిర్ణయించారు.
చర్చల్లేవ్ : ఈ కసరత్తుల తదుపరి మీడియాతో తమిళి సై మాట్లాడుతూ, ఇక, డీఎండీకేతో ఎలాంటి చర్చలు జరిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పొత్తు కోసం వెనక్కు తగ్గే స్థితిలో బీజేపీ లేదని వ్యాఖ్యానించారు. బీజేపీ జాతీయ పార్టీ అన్న విషయాన్ని గుర్తెరగాలని పరోక్షంగా విజయకాంత్‌కు హితవు పలికారు.ఈ ఎన్నికల్ని ఎలా ఎదుర్కొనాలో తమకు తెలుసునని, ఎవర్నీ తాము నిర్బంధించబోమని, వస్తే కలిసి పనిచేస్తామేగానీ, వాళ్ల డిమాండ్లకు తలొగ్గి, సామరస్య పూర్వకంగా వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 234 స్థానాల్లోనూ అభ్యర్థుల్ని నిలబెట్టగలిగిన బలం బీజేపీకి ఉందని, అందుకు తగ్గ కసరత్తులోనే ఉన్నామని వ్యాఖ్యానించడం విశేషం.
నేడు అమిత్ షా : తమిళనాట ఎన్నికల రాజకీయ రసవత్తరంగా మారిన సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బుధవారం చెన్నైకు రానున్నారు. ఆయన రాకతో రాజకీయ ప్రాధాన్యతకు ఆస్కారం ఉంటుందా..? అన్న చర్చ బయలు దేరింది. అయితే, ఆయన కామరాజర్ అరంగంలో జరిగే కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి సహస్త్ర చంద్ర దర్శనం వేడుకకు హాజరై వెంటనే ఢిల్లీ వెళ్లేలా పర్యటనను సిద్ధం చేసుకుని ఉన్నారు.
ఒంటరికి సై!
Published Wed, Mar 23 2016 8:40 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement