రాష్ట్రంలో అన్ని పార్టీలు సంపూర్ణ మద్య నిషేధం నినాదాన్ని అందుకుని ఉన్నా యి. ఇందులో బీజేపీ కూడా ఒకటి. తమ ఎన్నికల మేనిఫెస్టోలో తొలి పలుకుగా అదే నినాదాన్ని అందుకున్నారు. రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామని ప్రకటించారు. తమకు ఒక్క చాన్స్ ఇచ్చి చూడాలని, తమిళనాడును సమగ్రాభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని ఈసందర్భంగా నితిన్ గడ్కారి హామీ ఇచ్చారు.
సాక్షి, చెన్నై : చిన్న పార్టీలతో కలిసి బీజేపీ ఎన్నికల్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. 150కు పైగా స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల్ని రంగంలోకి దించింది. తమ పార్టీతో పాటుగా కూటమి అభ్యర్థులకు మద్దతుగా కమలనాథులు ప్రచారంలో పరుగులు తీస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తమకు అవకాశం ఇస్తే, చేసి చూపించే అంశాలతో కూడిన మేనిఫెస్టోను కమలనాథులు సిద్ధం చేశారు.
దీనిని టీ నగర్‌లో జరిగిన కార్యక్రమంలో గురువారం సాయంత్రం కేంద్ర రహదారులు, నౌకాయాన శాఖ మంత్రి నితిన్ గడ్కారి విడుదల చేయగా, కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ అందుకున్నారు. ముందుగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ తన ప్రసంగంలో తమకు అవకాశం ఇస్తే, రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని ప్రజలకు పిలుపు నిచ్చారు. ఇక, మేనిఫెస్టోను సిద్ధం చేసిన కమిటీని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా అభినందించారు.
తదుపరి నితిన్ గడ్కారి తన ప్రసంగంలో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగు పరిచే విధంగా ముందుకు సాగుతున్నామన్నారు. తమిళనాడులో బిజేపికి ఒక్కఛాన్స్ ఇచ్చి చూడాలని, బిజేపి పాలిత ప్రాంతాల్లో ఏమేరకు అభివృద్ధి పనులు సాగుతున్నాయో, దానికి రెండింతలుగా నిధుల్ని తమిళనాడులో తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజేపీ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మురళీ ధరరావు, సీనియర్ నేత ఇలగణేషన్ పాల్గొన్నారు. బీజేపీ మేనిఫెస్టోలో డీఎంకే ప్రకటించిన అంశాలు అనేకం ఉండడం గమనార్హం.
మేనిఫెస్టోలో కొన్ని :
- అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్య నిషేధం
- రైతులు తీసుకున్న రుణాలన్నీ మాఫీ
- అన్నదాతలకు పెద్ద పీట, వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్
- లోకాయుక్త ఏర్పాటు
- కొత్త పారిశ్రామిక విధానం
- విద్యా, ఉద్యోగ, ఉపాధి కల్పనకు ప్రాధాన్యం
- జౌళి పార్కుల ఏర్పాటు, ఇళ్లు లేని నేత కార్మికులకు సొంత గృహాలు, ఉదయ్ పథకం ద్వారా విద్యుత్ సౌకర్యం
- రెండేళ్లలో రాష్ర్టంలో మిగులు విద్యుత్ లక్ష్యం
- రాష్ట్రంలో క్రీడావర్సిటీ ఏర్పాటుకు, జిల్లాకో క్రీడా కేంద్రం
- శాంతి వనంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం, రాజకీయ జోక్యం లేని విధంగా కొత్త విధానాలు
- ఆదిద్రావిడ సంక్షేమ శాఖ , అరుంధతీయులకు ప్రత్యేక బోర్డు
- సీబీఎస్‌ఈ తరహాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనలు. నిర్భంధ తమిళంపై పరిశీలన(మాతృభాషల్లో చదువుకునేందుకు వీలుగా అవకాశం)
- తీవ్రవాదాన్ని, అసాంఘిక శక్తుల్ని ఉక్కుపాదంతో అణగదొక్కడం లక్ష్యంగా కఠిన నిర్ణయాలు.
-మహిళా సంక్షేమం లక్ష్యంగా పథకాలు, పేద యువతుల వివాహానికి ఎనిమిది గ్రాముల బంగారు పథకం, ఉపాధి కల్పన దిశగా శిక్షణా కేంద్రాలు. ప్లస్ టూ వరకు చదువుకునే పేద విద్యార్థినులకు నెలకు రూ. ఐదు వేలు ప్రోత్సాహం. విద్యార్థినులకు ప్రత్యేకంగా అన్నిప్రాంతాల్లో హాస్టళ్లు.
- జాలర్ల సంక్షేమం లక్ష్యంగా చర్యలు, దాడుల సమస్యకు శాశ్వత పరిష్కారం
- నీటివ్యాపారాన్ని అడ్డుకునే విధంగా రోజుకు 20 లీటర్ల నీటి క్యాన్ పంపిణీ
- ఆలయాల పరిరక్షణ, మతమార్పిడి అడ్డుకట్ట, ఆలయాల్లో దర్శనాలకు రుసుం రద్దు. ఆక్రమణలో ఉన్న ఆలయాల ఆస్తుల స్వాధీనం
- అన్ని రాష్ట్ర రహదారులు ఫోర్ వేలుగా మార్పు
- రేషన్‌కు స్మార్ట్ కార్డు, అన్ని రకాల వస్తువులు ఎల్లప్పుడు లభించే విధంగా చర్యలు
- జిల్లాకు ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ తరహాలో ప్రభుత్వ ఆసుపత్రులు. ఉచిత వైద్యం.
- ప్రభుత్వ గుప్పెట్లోకి ఇసుక విక్రయాలు, ధాతు ఇసుక, గ్రానైట్ క్వారీలు కూడా.
-2017 సంక్రాంతి పర్వదినంలో మళ్లీ జల్లికట్టు
మద్య నిషేధం
Published Fri, Apr 22 2016 3:02 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement