బీజేపీపై చెత్త అస్త్రం...
నగరంలో పేరుకుపోతున్న చెత్తపై విమర్శలు
బీబీఎంపీ ఎన్నికల కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రధాన అంశం
బెంగళూరు: గార్డెన్‌సిటీ నుంచి గార్బేజ్ సిటీగా మారిపోయిన బెంగళూరు నగరాన్ని తిరిగి గార్డెన్ సిటీగా మారుస్తామనే వాగ్దానంతో కాంగ్రెస్ పార్టీ ఈ బీబీఎంపీ ఎన్నికల్లో ప్రజల ముందుకు వెల్లనుంది. చెత్త సమస్య పరిష్కారంలో బీజేపీ వైఫల్యాన్ని అస్త్రంగా చేసుకొని బీబీఎంపీ ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకోవడానికి వ్యూహాలు రచిస్తోంది. చెత్త సమస్యను పరిష్కరించడంతో పాటు రోడ్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, తాగునీటి సమస్య పరిష్కారం వంటి అంశాలతో బీబీఎంపీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను రూపొందించింది. బీజేపీ బీబీఎంపీలో అధికారంలో ఉన్న సమయంలో నగరంలో చెత్త సమస్య ఏ విధంగా పెరిగిపోయిందో ఓ వైపున ప్రజలకు వివరిస్తూనే, తాము అధికారంలోకి వస్తే ఈ సమస్య పరిష్కారానికి ఏ కార్యక్రమాలు చేయబోతున్నామనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పొందుపరిచింది.
ఇక బీబీఎంపీ పాలన విషయంలో బీజేపీ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు బీజేపీ హయాంలో బీబీఎంపీలో చోటుచేసుకున్న కుంభకోణాలను సైతం తన మేనిఫెస్టోలో పేర్కొంది. ఈ కుంభకోణాల కారణంగా బీబీఎంపీ ఖజానాకు ఎంత నష్టం వాటిల్లింది, గత రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులు బీబీఎంపీలో ఎంత వరకు వినియోగమయ్యాయి? అనే అంశాలను సైతం ప్రజల ముందుకు తీసుకొచ్చి తమ ప్రచారాన్ని సాగించేందుకు కాంగ్రెస్ నేతలు సన్నద్ధమయ్యారు. ఇక నగర ప్రజలకు రోజు రోజుకు ఇబ్బంది కరంగా తయారవుతున్న ట్రాఫిక్‌జామ్‌కు సరైన పరిష్కారాన్ని కనుగొనేదిశగా ప్రణాళికను రూపొందించడాన్ని తమ మేనిఫెస్టోలో చేర్చారు. బీబీఎంపీ పరిధిలోని ప్రతి వార్డు అభివృద్ధి, నగరంలో మౌళిక వసతుల కల్పన, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు వంటి హామీలను పొందుపరిచారు. ఇక కుంభకోణాలతో నిండిపోయిన బీబీఎంపీని పూర్తిగా ప్రక్షాళన చేసి పారదర్శక పాలన అందజేయడంతో పాటు బెంగళూరు నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో స్వచ్ఛమైన, సురక్షిత నగరంగా తీర్చిదిద్దుతామనే ప్రధాన హామీతో ఈ బీబీఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు తమ ప్రచారాన్ని కొనసాగించనున్నారు.