గార్డెన్ కాదు.. గార్బేజ్ సిటీ!
ఒకప్పుడు ఆ నగరం అంటే అందాల హరివిల్లు. ఎటు చూసిన పచ్చదనంతో, చల్లటి గాలులు వీస్తూ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బెంగళూరు నగరం ఒకప్పుడు గార్డెన్ సిటీ నుంచి తర్వాత సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా మారి, ఇప్పుడు ఏకంగా గార్బేజ్ సిటీ అయిపోయిందని అంటున్నారు. నగరంలో జనాభా ఎక్కువ కావడం వల్లో, ప్రజల్లో అవగాహన కొరవడటం వల్లో గానీ.. చెత్త సేకరణ సేవలు సరిపోవడం లేదని దాంతో నగరంలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. నగరం విస్తరిస్తున్న విషయాన్ని కొన్ని దశాబ్దాల నుంచి ఎవరూ పెద్దగా పట్టించకోలేదు. కేవలం రోడ్లు, తాగునీరు, డ్రైనేజి, వీధిలైట్లు, గృహసముదాయాల్లాంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తే సరిపోతుందని భావించారు తప్ప.. కొత్తగా వస్తున్న ఇళ్ల నుంచి చెత్తను ఎలా తీసుకెళ్లాలి, ఎక్కడ డంప్ చేయాలి, చెత్త నిర్మూలన వ్యవస్థను ఎలా అభివృద్ధి చేయాలనే ఆలోచన పాలకులలో కొరవడటమే ప్రస్తుత పరిస్థితికి కారణం. పొద్దున్నే లేచేసరికి అప్పుడే ఏదో కల ముగుస్తూ ఉంటుందని.. కానీ నిద్రలేవగానే చెత్త కంపు ముక్కుపుటాలు అదిరేలా వస్తుందని రస్తోగి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పారు. తాము తలుపులు, కిటికీలు అన్నీ మూసేసినా కూడా ఇదే పరిస్థితి అని వివరించారు.
ఒకప్పుడు వేరే రాష్ట్రాల వాళ్లు ఎక్కడికైనా టూర్ వెళ్లాలనుకుంటే ముందుగా బెంగళూరు గురించి ఆలోచించేవాళ్లు. మిగిలిన దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ చల్లగా ఉండటం, దానికితోడు మంచి వాతావరణం కనిపించడమే అందుకు కారణం. కానీ ఇప్పుడా పరిస్థితి లేదంటున్నారు. 1990లలో బెంగళూరు జనాభా కేవలం 30 లక్షలు మాత్రమే ఉండేది. ఇప్పుడది ఏకంగా 80 లక్షలు దాటిపోయింది. కానీ సదుపాయాలు మాత్రం ఆ స్థాయిలో పెరగడం లేదు.
పట్టణాభివృద్ధి శరవేగంగా జరుగుతున్నా, ప్రణాళికలు మాత్రం ఆ స్థాయిలో లేకపోవడం ప్రధాన సమస్య. ఐటీ హబ్‌గా బెంగళూరు తయారుకావడంతో ఇక్కడ ఉద్యోగాలు చేసుకోడానికి దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి కూడా జనం తండోపతండాలుగా రావడం మొదలుపెట్టారు. దాంతో నగరం కూడా బాగా విస్తరించింది. దాంతో మునిసిపాలిటీ మీద భారం పెరిగిపోయింది. ఒక రోజుకు బెంగళూరు నగరంలో 3500 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. దాంతో 2013లో కొత్త ట్రీట్మెంట్ ప్లాంటును మునిసిపాలిటీ ప్రారంభించింది. మొదట్లో అది నగర శివార్లలోనే ఉండేది. కానీ నగర విస్తరణలో భాగంగా అక్కడివరకు ఇళ్లు వచ్చేయడంతో.. చుట్టుపక్కలవాళ్లు ఆ కంపు భరించలేకపోతున్నారు. ఇక్కడొక్క చోటే కాదు.. నగరంలో ఎటు చూసినా చెత్తకుప్పలే దర్శనం ఇస్తున్నాయి. దాంతో రోడ్లమీద వెళ్లేవాళ్లు కూడా ముక్కులు మూసుకోక తప్పడం లేదు. మళ్లీ తమ నగరం గార్డెన్‌సిటీ, క్లీన్‌సిటీగా ఎప్పటికి మారుతుందోనని బెంగళూరు వాసులు ఎదురుచూస్తున్నారు.