తమిళిసైకు అభినందనల వెల్లువ | Jayalalithaa, Karunanidhi and other leaders greet BJP's Tamil Nadu chief Tamilisai | Sakshi
Sakshi News home page

తమిళిసైకు అభినందనల వెల్లువ

Published Sun, Aug 17 2014 11:38 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

తమిళిసైకు అభినందనల వెల్లువ - Sakshi

తమిళిసైకు అభినందనల వెల్లువ

 సాక్షి, చెన్నై: రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా నియమితులైన తమిళిసై సౌందరరాజన్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం జయలలిత ప్రత్యేకంగా అభినందన లేఖ పంపించారు. డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకే నేతలు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత కుమరి ఆనందన్ తన కుమార్తె ఎక్కడున్నా, ఆనందంగా ఉండాలని ఆశీర్వదించారు. సమష్టి సహకారంతో పార్టీ బలోపేతానికి ముందుకు సాగునున్నట్టు కొత్త అధ్యక్షురాలు తొలి పలుకు పలికారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి ప్రప్రథమంగా మహిళా నాయకురాలు తమిళి సై సౌందరరాజన్ నియమితులైన విషయం తెలిసిందే.
 
 ఈమె తండ్రి కుమరి ఆనందన్ కాంగ్రెస్‌వాది. కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న కుమరి ఆనందన్ బాటలో కాకుండా, బీజేపీ వైపుగా పదిహేనేళ్ల క్రితం తమిళి సై అడుగులు వేశారు. భర్త సౌందరరాజన్, తాను వృత్తి పరంగా వైద్యులైనప్పటికీ, రాజకీయంగా స్వశక్తితో బీజేపీలో ఆమె ఎదిగారు. రెండు సార్లు అసెంబ్లీకి, ఓ మారు లోక్ సభకు పోటీ చేసి ఓటమి చవి చూసినా డీలా పడలేదు. చిన్న చిన్న పదవుల నుంచి జాతీయ స్థాయి పదవిని దక్కించుకుని, ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష స్థానంలో కూర్చున్న తొలి మహిళగా రికార్డులోకి ఎక్కారు. దీంతో తమిళి సైకు పార్టీలకు అతీతంగా అభినందిస్తున్నారు.
 
 అభినందన లేఖ : తమిళి సై సౌందరరాజన్‌ను అభినందిస్తూ సీఎం జయలలిత ప్రత్యేక లేఖ పంపించారు. ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా తమరు నియమితులు కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ప్రశంసించారు. తమరు మరింతగా రాణించగలరన్న నమ్మకం ఉంద ంటూ తన శుభాకాంక్షలు తెలియజేశారు. డీఎండీకే అధినేత విజయకాంత్, ఎండీఎంకే నేత వైగో, పీఎంకే నేత రాందాసు, పుదియ నిధి కట్చి నేత ఏసీ షన్ముగం శుభాకాంక్షలు తెలియజేశారు. ఇన్నాళ్లు బీజేపీ నేతలకు దూరంగా ఉన్న ఎండీఎంకే, పీఎంకే, డీఎండీకే నేతలు తమిళి సై రాకతో ఆనందం వ్యక్తం చేయడం గమనించాల్సిందే. ఇక, జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వంతో స్నేహ పూర్వకంగా మెలిగే పనిలో పడ్డ సీఎం జయలలిత, కొత్త అధ్యక్షురాలికి అభినందనల లేఖ రాయడం బట్టి చూస్తే, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని అక్కున చేర్చుకోవచ్చన్న చర్చ మొదలైంది. ఇక, తన కుమార్తె రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులవడంతో కుమరి ఆనందన్ సంతోషం వ్యక్తం చేశారు. ఆమె ఎక్కడున్నా.., ఆనందంగా జీవించాలని ఆశీర్వదిస్తున్నట్లు పేర్కొన్నారు.
 
 సమష్టిగా ముందుకు : అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తమిళిసై సౌందరరాజన్ సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా అందరినీ కలుపుకుని సమష్టిగా పార్టీ బలోపేతం లక్ష్యంగా ముందుకు సాగనున్నట్టు ప్రకటించారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ, తన మీద నమ్మకంతో ఈ పదవిని జాతీయ నేతలు అప్పగించారని పేర్కొన్నారు. పదవిగా కాకుండా బాధ్యతగా తాను భావిస్తున్నానన్నారు. ప్రతి క్షణం పార్టీ కోసం శ్రమించనున్నట్టు చెప్పారు. అందర్నీ కలుపుకుని పార్టీ బలోపేతానికి అడుగులు వేయనున్నామని, అసెంబ్లీ ఎన్నికల్లోపు బలమైన శక్తిగా అవతరించాలన్న కాంక్షతో ముందుకు సాగుతామని తెలిపారు. తమిళ ప్రజలకు తన వంతుగా కేంద్రం నుంచి ఏమేమి రావాలో, అందాలో వాటిని సరైన సమయంలో సక్రమంగా తెప్పించేందుకు కృషి చేస్తానన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement