ఓటు వేయకుంటే చంపేస్తాడు: కెప్టెన్
కేకేనగర్: ఎన్నికల్లో డీఎండీకే పార్టీకి ఓటు వేసి గెలిపించకపోతే తన కుల దైవం లక్ష్మీ నరసింహస్వామి ఓటర్ల ప్రాణాలు తీస్తాడని ఆ పార్టీ అధినేత కెప్టెన్ విజయకాంత్ విచిత్ర ప్రచారానికి దిగారు. దేవుడి పేరు చెప్పి ఓటర్ల ను భయపెడుతున్న కెప్టెన్ తీరుకు ప్రజలు, రాజకీయ పార్టీల వారు విస్తుపోతున్నారు. ఓటర్లను బుజ్జగించడం, లేకపోతే భయపెట్టి ఎలాగైనా ఓట్లు సాధించడమే ధ్యేయం గా కెప్టెన్ ప్రచారం సాగిస్తున్నారు.
విల్లుపురం జిల్లా ఊళుందూరుపేట నియోజక వర్గంలో విజయకాంత్ పోటీ చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి తిరునావలూర్ నియోజకవర్గంలో రాత్రి వరకు భారీగా ప్రచారం చేశారు. మడపట్టు గ్రామంలో విజయకాంత్ మాట్లాడుతూ ప్రస్తుతం మీడియాలో వచ్చే అభిప్రాయ సేకరణను ప్రజలు నమ్మవద్దని కోరారు. వాటి అన్నింటిని అధిగమించి ప్రజా సంక్షేమ కూటమి అమోఘ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మడపట్టు ప్రాంతంలో వీధిదీపాలు వెలగకపోవడంతో ఇక్కడ నగదు బట్వా డా జరుగుతోందా? అని కెప్టెన్ ప్రశ్నించారు. తాను పరిక్కల్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఓటర్లకు నగదు పంపిణీ చేయనని ప్రమా ణం చేసినట్లు తెలిపారు. ‘నాకు మీరు ఓటు వేయకుంటే నరసింహస్వామి మిమ్మల్ని చంపకుండా వదలడు. నా లాగా ఇతర పార్టీల వారు అవినీతి చేయమని ప్రమాణం చేయగలరా’? అని విజయకాంత్ ప్రశ్నించారు.